ఆర్.కృష్ణయ్యకు ఎంపీ పోస్టు: చంద్రబాబు సహించేనా?

తనను తిట్టే వ్యక్తికి తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించి గద్దె ఎక్కించడాన్ని ఆయన సహించగలరా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి ప్రాపకం ద్వారా లభించిన రాజ్యసభ ఎంపీ పదవికి కూడా ఇటీవల రాజీనామా చేసిన వారిలో బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య కూడా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడికి కూడా తమ పార్టీలో దిక్కులేనట్టుగా అప్పట్లో ఆర్.కృష్ణయ్యను తెలంగాణ నుంచి దిగుమతి చేసుకుని రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టడమే పెద్ద వివాదం అయింది. దానికి తగ్గట్టుగానే.. జగన్ ఓడిపోయిన వెంటనే.. పార్టీకి రాజీనామా చేసేసి ఆర్.కృష్ణయ్య తన నైజం ప్రదర్శించారు. అప్పటి నుంచి కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో ఎందులో చేరుతారా స్పష్టత ఇవ్వకుండా ఊగిసలాడుతూ వచ్చారు.

తాజాగా భారతీయ జనతా పార్టీ ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆర్.కృష్ణయ్యనే ఒక స్థానానికి ఎంపిక చేసి పార్టీ వర్గాలకు షాక్ ఇచ్చింది. అయితే ఆర్.కృష్ణయ్యకు ఎంపీ పదవి కట్టబెట్టడం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహించగలుగుతున్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

ఆర్.కృష్ణయ్య బీసీ సంఘాల నాయకుడిగా ఎంతగా గుర్తింపు ఉన్న నాయకుడే అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ ద్వారా మాత్రమే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 2014లో ఏపీ విభజన తర్వాత.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఠికానా లేదని, ఖచ్చితంగా ఓడిపోతుందని స్పష్టత ఉన్న సమయంలో.. చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా ఆర్.కృష్ణయ్యను తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయించి.. తెలుగుదేశం తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించారు. అనుకున్నట్టు పార్టీ దారుణంగా ఓడిపోయింది.

సీఎం స్థాయి అభ్యర్థిగా మురిసిపోతూ బరిలోకి దిగిన ఆర్.కృష్ణయ్యకు పార్టీ ఓటమి తర్వాత గానీ విషయం అర్థం కాలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా తెలుగుదేశానికి దూరంగా ఉంటూ ఆయన చంద్రబాబునాయుడు తీవ్రంగా దుమ్మెత్తి పోశారు. అప్పటినుంచి చంద్రబాబును బీసీ ద్రోహిగా చిత్రీకరిస్తూనే ఉన్నారు. అలా చంద్రబాబును తిడుతున్నారు గనుకనే.. వైఎస్ జగన్ ప్రత్యేకంగా పిలిచి రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం కూడా జరిగింది.

ఆర్.కృష్ణయ్య ఎక్కడ చక్రం తిప్పారో తెలియదు గానీ.. ఇప్పుడు భాజపా ద్వారా ఏపీ నుంచి ఎంపీ పదవి దక్కించుకున్నారు. దక్కిన మూడు ఎంపీ సీట్లలో ఒకటి బిజెపికి, అది కూడా తనను తీవ్రంగా నిరసించే ఆర్.కృష్ణయ్యకు కట్టబెట్టడానికి చంద్రబాబునాయుడు సుముఖమేనా.. తనను తిట్టే వ్యక్తికి తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించి గద్దె ఎక్కించడాన్ని ఆయన సహించగలరా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మరి పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.

11 Replies to “ఆర్.కృష్ణయ్యకు ఎంపీ పోస్టు: చంద్రబాబు సహించేనా?”

  1. తనను కాదని వెళ్లిన వారికి బిజెపి వారు పదవి ఇస్తే మా అన్నయ్య కి సహిస్తుందా..

Comments are closed.