రేషన్ బియ్యం విధానం అవసరమా?

ఇప్పుడు సరైన సమయం వచ్చింది. దేశంలో పేద ప్రజలకు ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.

ఇప్పుడు సరైన సమయం వచ్చింది. దేశంలో పేద ప్రజలకు ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. పేదల కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, వారు ఆర్థికంగా పరిపుష్టి సాధించడానికి అనేక ఆర్థిక సాయం పథకాలు కూడా ఉంటుండగా.. మళ్లీ రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వడం అవసరమా? అనే చర్చ ఇప్పుడు దేశంలో జరగాల్సిన అవసరం ఉంది.

ఇది సరైన సమయం. రేషన్ బియ్యం విధానాన్ని పునస్సమీక్షించుకోవాల్సిన సమయం. రేషన్ బియ్యం విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని కోరడం ఈ కథనం ఉద్దేశం కాదు. కానీ.. సమీక్షించడం మాత్రం అవసరం.

రేషన్ బియ్యం విధానాన్ని సమీక్షించుకోవడానికి ఇదే సరైన సమయం అనడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి- అందరూ ఎరిగినదే! రేషన్ బియ్యం విదేశాలకు స్మగ్లింగ్ అయిపోతున్నదని కూటమి ప్రభుత్వం అనేక ఆధారాలను సంపాదిస్తున్నది. కాకినాడ పోర్టు ద్వారా బియ్యం స్మగ్లింగు జరుగుతున్నదని ఇటీవల గుర్తించారు. ఇప్పుడు విశాఖలో కూడా రేషన్ బియ్యం బస్తాలను గుర్తించారు. అంటే రేషన్ బియ్యం విదేశాలకు స్మగ్లింగ్ అయిపోతున్నదని అంటే దానిఅర్థం ఏంటన్నమాట? ప్రజలు దానిని తీసుకోవడం లేదనే కదా! అంటే ఆ బియ్యంలో నాణ్యత లేదనే కదా!

ఇదే సమయంలో కిలో బియ్యం ను రూ.40కి కొని పేదలకు ఉచితంగా ఇస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. స్మగ్లింగ్ అవుతున్న రేషన్ బియ్యం ఆఫ్రికా దేశాలకు చేరి కిలో రూ.150 వంతున అమ్ముడవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆరాతీస్తున్నదంటే.. అక్రమాలన్నీ, అంటే బియ్యం స్మగ్లింగులన్నీ వైసీపీ వారే చేస్తున్నట్టుగా చెప్పడానికే తపన పడుతుంది. బియ్యం స్మగ్లింగు ద్వారా వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలు తినేస్తున్నారనేది వారి ఆరోపణ. అదే సమయంలో రెండో కారణం కూడా ఉంది.

రెండోది- సుప్రీం కోర్టు తీర్పు! కరోనా వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పేదలందరికీ రేషన్ బియ్యం ఉచితంగానే ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం చూసి సుప్రీం కోర్టు ఆశ్చర్యపోయింది. ఉచితంగా బియ్యం ఎంతకాలం ఇస్తారు. ప్రజలకు ఉపాధి చూపించి, వారు సంపాదించుకుని తినగలిగేలా చేయలేరా? అని ప్రశ్నించింది. ఈ రెండు కారణాల చేత ఉచిత బియ్యం విధానాన్ని సమీక్షించుకోవాలి.

ప్రభుత్వం రూ.40 పెట్టి కొంటున్నామని అంటోంది కదా. మరి ఉచితంగా బియ్యం ఇచ్చే బదులుగా పేద కుటుంబాలకు రూ.200 నెలకు ఇచ్చేస్తే సరిపోతుంది కదా.. అనేది ప్రజల సందేహం. పేదలు ఆ బియ్యం తీసుకోవడం లేదు కాబట్టే.. స్మగ్లింగు మార్కెట్లోకి వెళుతున్నాయి. అదే 200 ఇచ్చేస్తే.. మార్కెట్లో రూ.50కు నాణ్యమైన బియ్యం దొరుకుతున్నాయి. ప్రజలు రూ.10 తామే సర్దుబాటు చేసుకుని.. నచ్చితే ఆ బియ్యమే కొనుక్కంటారు. పైగా స్మగ్లింగును నూటికి నూరుశాతం అరికట్టడం కూడా సాధ్యమవుతుంది కదా అనేది ప్రశ్న.

అలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటేనే మేలు జరుగుతుంది. అలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. స్మగ్లింగ్ దందా తమ చేతుల్లోకి వస్తే బాగుండుననే దుగ్ధ తప్ప.. పేదల జీవితాలు బాగుపడాలనే కోరిక ప్రభుత్వాలకు ఉన్నట్టుగా నమ్మడం కష్టం.

8 Replies to “రేషన్ బియ్యం విధానం అవసరమా?”

  1. లబ్ధిదారు కి డబ్బు కావాలా బియ్యం కావాలా అని ఆప్షన్స్ ఇవ్వాలి అతను ఏది కోరితే అదే చెయ్యాలి దీంట్లో వేరేవారి అభిప్రాయం అనవసరం

Comments are closed.