కూటమి నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో రుణపడ్డారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చిందంటే… దానికి కూటమే కారణం. ప్రతి సందర్భంలోనూ జగన్ నమ్మకాన్ని, నిబద్ధతతను కూటమి నేతలు పెంచుతున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ మేనిఫెస్టో విలువను బీజేపీ మినహా కూటమి మేనిఫెస్టో అమాంతం పెంచేసింది. ఇప్పటికే సూపర్‌సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు వైసీపీ కాపీ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మరిన్ని పథకాలను చేర్చి జనసేన, టీడీపీ మేనిఫెస్టో విడుదలైంది. ఇందులో బీజేపీ భాగస్వామ్యం కాకపోవడంతో ఆ మేనిఫెస్టోకు విలువ లేకుండా పోయింది. ఇదే సందర్భంలో వైసీపీ మేనిఫెస్టోకు టీడీపీ-జనసేన మేనిఫెస్టో విలువ పెంచినట్టైంది. బాబు, పవన్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాకపోవడం వల్లే బీజేపీ దూరమైందనే సంకేతాలు వెలువడ్డాయి.
మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే రూ.1.75 లక్షల కోట్లు అవసరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పవన్, బాబు వెల్లడించిన సంక్షేమ పథకాల అమలుకు మూడు రాష్ట్రాల బడ్జెట్ అవసరమని స్పష్టం చేస్తున్నారు. దీంతో కూటమి మేనిఫెస్టో అమలయ్యేది లేదు, చచ్చేది లేదని సామాన్య ప్రజానీకం సైతం అనుకుంటున్నారు. తక్కువో, ఎక్కువో జగన్ హామీ ఇస్తే, చేస్తాడనే నమ్మకం బాగా పని చేస్తోంది. అందుకే వైసీపీ మేనిఫెస్టోకు విశ్వసనీయత పెరిగింది.
మరీ ముఖ్యంగా మోదీ సర్కార్ బాబు మేనిఫెస్టోకు నిధులు ఇవ్వదట అనే ప్రచారం వెల్లువెత్తుతోంది. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న బాబు, పవన్ మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదు. ఏపీలో తాజా పరిణామాలు జగన్‌పై మరింత నమ్మకాన్ని పెంచుతున్నాయి.
బాబు చెప్పాడంటే, ఏదీ చేయడని గతానుభవాలు చెబుతున్నాయని, ఇదే జగన్ విషయానికి వస్తే కరోనా సమయంలోనూ అన్నీ చేశాడని సామాన్యులు సైతం మాట్లాడుకుంటున్నారు. జగన్‌పై జనంలో నమ్మకం పెరగడానికి కూటమి వ్యవహరిస్తున్న తీరు తోడైంది. బాబు, పవన్ ఉత్తుత్తి హామీలు ఇస్తున్నారని చర్చించుకునే పరిస్థితి వచ్చింది.