దర్శకుడు ప్రశాంత్ నీల్ డిమాండ్ అలా వుంది మరి. హీరోలు టెన్షన్ పడడం లేదు. నిర్మాతలు ఆతృతగా వున్నారు. కెజిఎఫ్ 2, సలార్ తరువాత ప్రశాంత్ నీల్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. సలార్ తరువాత వెంటనే సలార్ 2 వుంటుందా? వుండదా? అన్నదానికి క్లారిటీ లేదు.
ఇలాంటి నేపథ్యంలో తమ సినిమా అంటే తమ సినిమా అని నిర్మాతలు పోటీ పడుతున్నారు. హోంబలే సంస్థ ఇప్పట్లో ప్రశాంత్ నీల్ ను వదలుకోవాలని అనుకోవడం లేదు. అందువల్ల అర్జంట్ గా సలార్ 2 ను స్టార్ట్ చేయించాలని చూస్తోంది.
కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే హీరో ప్రభాస్ రెడీగా లేరు. ప్రాజెక్ట్ కె రెండో భాగం చేయాలి. హను రాఘవపూడి డైరక్షన్ సినిమా చేయాలి. ఇప్పటికే నడుస్తున్న రాజా సాబ్ ఫినిష్ చేయాలి. అన్నింటికి మించి సందీప్ వంగా స్పిరిట్ సినిమా కూడా చేయాలి. వీటిలో ఏది ముందు.. ఏది వెనుక అన్నది ఇంకా తెలియదు. వన్ వీక్ చేసి, పది రోజులు ఆపి, మళ్లీ వన్ వీక్ చేసి, ఇలా ఇన్ని సినిమాలు ఎప్పటికి పూర్తవుతాయి? వీటి మధ్యలో సలార్ 2 అంటే మరి ప్రభాస్ ఆలోచన ఏమిటో తెలియదు.
మైత్రీ సంస్థ అర్జంట్ గా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తోంది. అక్కడ కూడా హీరో మరీ రెడీగా లేరు కానీ, నవంబర్ వేళకు రావడానికి అవకాశం వుంది. అందువల్ల ప్రశాంత్ నీల్ ను ఒప్పించి, ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయించేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ప్లస్ ఏమిటంటే, హీరో ఎన్టీఆర్ కూడా అందుకు సముఖంగా వున్నారు.
ప్రస్తుతానికి రెండు క్యాంప్ ల వైపు నుంచి తమ సినిమా ముందు అంటే తమ సినిమా ముందు అని వార్తలు బయటకు వస్తున్నాయి. కొన్నాళ్లు ఆగితే ఎవరి వార్తలు ముందు అన్నది క్లారిటీ వస్తుంది.