సొంత నియోజకవర్గ కుప్పంలో చంద్రబాబు పర్యటనకు వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులెవరూ హర్షించరు. అధికారం శాశ్వతం కాదు. అలాగే ప్రతిపక్ష హోదా కూడా శాశ్వతం కాదు. అధికార, ప్రతిపక్ష హోదాలు మారుతూ వుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వ విధానాలకు పాల్పడితే భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది.
కుప్పంలో చంద్రబాబు పర్యటన ముందుకు సాగకుండా వైసీపీ నేరుగా ఘర్షణకు దిగింది. రెండోరోజు అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేసే వరకూ వైసీపీ వెళ్లింది. వైసీపీ అభిమానులకు ఇలాంటివి ఆనందం కలిగించొచ్చు. బాబుకు బాగా బుద్ధి చెప్పారని సంబరపడొచ్చు. ఇలాంటి ఫీలింగ్స్ అధికారంలో వున్న పార్టీ నేతలకు కలగడం సహజం. కానీ ఇది మంచిది కాదనేది పౌర సమాజం భావన. ప్రజాస్వామ్య ప్రేమికులు, తటస్థులు, విద్యావంతులు, ఉద్యోగులకు మాత్రం కుప్పం తాజా పోకడలు రుచించవు. గతంలో టీడీపీ ఇట్లే అడ్డంకులు సృష్టించి వుంటే వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించేవారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని నిరోధించి వుంటే జగన్ కనీసం ఒక్క అడుగైనా ముందుకు వేసేవారా? అని పౌర సమాజం నిలదీస్తోంది. కుప్పంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే రక్షణ కల్పించలేకపోతే, ఇక సామాన్యుల సంగతేంటనే ప్రశ్న తలెత్తుతోంది. తనను ఎన్నుకున్న ప్రజల మధ్య చంద్రబాబు మూడు రోజులు గడపాలని వెళ్లారు. ఆయన పనేదో చేసుకుని వెళితే నష్టమేంటి? అసలు చంద్రబాబును అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి ఎందుకొచ్చింది?
చంద్రబాబు పర్యటనలో వైసీపీ తలదూర్చాల్సిన అవసరం ఏంటి? బాబు పర్యటనను అడ్డుకుంటే టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురికావా? ఇదంతా పూర్తిగా వైసీపీని బద్నాం చేయడానికి పార్టీలోని కొన్ని దుష్టశక్తుల పన్నాగంగా కనిపిస్తోంది. వైసీపీ అంటే రౌడీరాజ్యమనే ప్రతిపక్షాల విమర్శలకు కుప్పం ఉదంతాలు బలం కలిగించడం లేదా? తమ పరిపాలనా విధానాలను సమాజం గమనిస్తోందన్న స్పృహ వైసీపీ నేతల్లో వుంటే…. ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగేవాళ్లా?
ఖబడ్దార్ జగన్ అని చంద్రబాబు హెచ్చరించడంలో తప్పేం వుంది? గతంలో చంద్రబాబు పాలనా తీరు ఎలా వున్నా… ఇలా మరీ బరితెగించి ప్రత్యర్థుల కార్యక్రమాలను అడ్డుకున్న దాఖలాలు లేవు. మరెందుకో గానీ, వైసీపీ పాలనలో ప్రత్యర్థులపై దాడికి తెగబడుతున్నారు. అధికారంలో తామే శాశ్వతమని, ఎదురే లేదనే భ్రమల్లో ఉన్నట్టుగా, వారి చేష్టలను చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికైనా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎవరి పని వాళ్లు చేసుకునేలా వైసీపీ పాలన సాగించాల్సిన అవసరం వుంది.