ప్రపంచంలో ఏం జరిగినా సరే.. అది నా పెతాపమే అని చెప్పుకునే బాపతు స్వయం ప్రకటిత హీరోలు కొందరుంటారు. సాయంత్రం అయ్యాక సూర్యుడు పడమటి కొండల్లోకి దిగిపోతూ ఉంటే.. ‘ఠాట్.. ఇంకో అరగంటలో నువ్వు నా కళ్ల ముందునుంచి వెళ్లకపోయావంటే నీ భరతం పడతా.. అవతలికి ఫో’ అని రంకెలు వేస్తారు. ‘రేపుదయం దాకా నాకు కనపడొద్దు’ అంటూ ఆగ్రహిస్తారు. సూర్యుడు అస్తమించి, మరునాడు ఉదయించాక.. ‘‘చూశారా నాదెబ్బకు భయపడిపోయి సూర్యుడు నిన్న సాయంత్రం వెళ్లిపోయి జస్ట్ ఇప్పుడే మళ్లీ వొచ్చాడు.. నేనంటే అంత భయం’’ అంటూ గప్పాలు కొట్టుకుంటారు.
చినబాబు నారా లోకేష్ కూడా ఇప్పుడు ఇలాంటి హీరోయిజాన్నే ప్రదర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజల బాగు గురించి పట్టించుకుంటున్నాడంటే.. అది నా పాదయాత్ర పెతాపమే అని ప్రకటించడం ఒక్కటే తక్కువ.. ఆ రేంజి గప్పాలు కొడుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రకటించారు. ఏప్రిల్ నుంచి ఇది ప్రారంభం అవుతుంది. వారంలో రెండు రోజులు రెండు పల్లెలకు వెళ్లి అక్కడి ప్రజలతో ముఖాముఖి నిర్వహించి ఆ రాత్రికి ఆ పల్లెలోనే నిద్రించాలనేది ఈ కార్యక్రమ స్వరూపం. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు రకరకాల వినూత్నమైన పద్ధతులను అనుసరిస్తున్న జగన్.. ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి వెళ్లి పల్లెల్లో నిద్రించే పథకానికి శ్రీకారం చుడుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలను, అధికార్లను వెళ్లి పల్లెల్లో బసచేసి వారి కష్టనష్టాలు తెలుసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా ఉండేవి.
కాగా.. జగన్ ప్రకటించిన ఈ కొత్త కార్యక్రమం తననుచూసి జడుసుకోవడం వల్లనే అని చినబాబు అంటుండడం విశేషం. తన యువగళం పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి.. యువగళం యాత్ర తీవ్రతను తట్టుకునేందుకు.. నాలుగేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమైన ముఖ్యమంత్రి ఇప్పుడు పల్లెబాట పడుతున్నారంటూ లోకేష్ ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలే ఆ యువగళం పాదయాత్ర నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్నట్టుగా నీరసంగా సాగుతోంది. ఆ పాదయాత్రను చూసి ముఖ్యమంత్రి జడుసుకున్నాడని అనుకోవడం లోకేష్ కే చెల్లింది.
అయినా.. ఇలా ప్రపంచంలో ఏం జరిగినా సరే.. అది తమ ఘనతే అని చెప్పుకునే లక్షణం నారా కుటుంబానికి సహజంగా డిఎన్‌ఏలోనే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. బిల్ గేట్స్ కు కంప్యూటర్ అంటే ఏమిటో నేర్పింది నేనే అని చెప్పుకునే బాపతు వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. అలాగే.. చినబాబు కూడా.. జగన్ పల్లెనిద్ర కార్యక్రమానికి అసలు కారణం నా యాత్ర పట్ల ఉన్న భయమే అని చాటుకుంటున్నాడు. తన మాటలు విని జనం నవ్వుతారనే ఆలోచన కూడా లేకుండా పోతున్నారు.