మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ జనంలోకి వెళ్లారు. జనం సమస్యల్ని తెలుసుకుని, పాలకుడిని తిడితే రాజకీయ ప్రయోజనం వుంటుంది. కానీ వాళ్లిద్దరూ చేస్తున్నదేంటి? కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిట్టడానికే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే సంకేతాలు వెళ్లాయి. ఇది టీడీపీకి ఎంత మాత్రం లాభం కలిగించదు.
పాదయాత్రలో లోకేశ్ కామెడీ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌ను జనం తిడితే తమకు ఉపయోగమని తండ్రీతనయుడు ఎందుకు గ్రహించలేదో అర్థం కాదు. జగన్ పాలనలో జనానికి కలిగిన నష్టాల్ని పాదయాత్రలో ఎంత ఎక్కువ ఏకరువు పెడితే టీడీపీకి అంత ప్రయోజనం వుంటుంది. అయితే జనంతో మాట్లాడించడం తక్కువ, లోకేశ్ ఊదరగొట్టడం ఎక్కువై పోయింది. దీంతో ప్రజల దృష్టిలో లోకేశ్ పలుచన అవుతున్నారు.
సైకో సీఎం, తాడేపల్లి ప్యాలెస్ పిల్లి, శాడిస్ట్ జగన్‌రెడ్డి, రేయ్ అంటూ యథేచ్ఛగా ఆయన్ను తిట్టిపోస్తున్నారు. ఇక స్థానిక నియోజకవర్గ టీడీపీ నేతలు చెబుతున్నవన్నీ నమ్మి, వైసీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులపై లోకేశ్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మరీ తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారు.
అబద్ధాల్ని తండ్రికి మించి మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం మాట్లాడినా జనం నమ్ముతారనే పిచ్చి భ్రమలో లోకేశ్ ఉన్నట్టున్నారు. ఆ పరిస్థితికి కాలం చెల్లిందని గత ఎన్నికల అనుభవం గుణపాఠం చెప్పింది. అయినా పంథా మాత్రం మారలేదని పాదయాత్రలో లోకేశ్ మాటలే చెబుతున్నాయి.