తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కూటమి టికెట్ మార్పు తీవ్ర వివాదానికి దారి తీసింది. టీడీపీ మొదటి జాబితాలో అనపర్తి టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించారు. దీంతో ఆయన క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి కేటాయించినట్టు వార్తలొచ్చాయి. తన టికెట్‌ను బీజేపీకి కేటాయిస్తే ఊరుకునేది లేదని రామకృష్ణారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అయినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థి శివకృష్ణరాజు పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. దీంతో టీడీపీ భగ్గుమంది. అనపర్తి మండలం రామవరంలోని రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
టీడీపీ జెండాలు, కరపత్రాలు, ప్లెక్సీలు, ఎన్నికల సామగ్రిని రామకృష్ణారెడ్డి అనుచరులు ధ్వంసం చేశారు. వాటిని మంటల్లో వేసి బూడిద చేశారు. అలాగే ఆ మంటల్లో సైకిల్‌ను వేశారు. చంద్రబాబునాయుడు కట్టప్ప రాజకీయాలు మానుకోవాలని రామకృష్ణారెడ్డి అనుచరులు హితవు చెప్పారు.
అలాగే అనపర్తి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పోటీ చేస్తుండడం వల్లే, బాబుకు అలుసైందని ఆయన అనుచరులు విమర్శిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆ సామాజిక వర్గం బలం అంతగా లేకపోవడం వల్లే బాబుకు రామకృష్ణారెడ్డి చులకన అయ్యారని అనుచరులు మండిపడుతున్నారు. తమ నోటి దగ్గరికి వచ్చిన టికెట్‌ను లాక్కుని బీజేపీకి ఇచ్చారని, ఎలా గెలుస్తారో చూద్దామని రామకృష్ణారెడ్డి అనుచరులు హెచ్చరించడం గమనార్హం.