మంత్రి ఆర్కే రోజా అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ అనే పేరు వుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్‌కల్యాణ్ విమర్శలు చేస్తే చాలు… ఘాటైన కౌంటర్ ఇవ్వడానికి తానున్నా అంటూ రోజా శివంగిలా చెలరేగిపోతుంటారు. జగన్‌కు సొంత తోడపుట్టిన చెల్లెలు షర్మిల ద్రోహం చేస్తోందన్న అభిప్రాయం వుంది. ఈ నేపథ్యంలో ఆత్మ బంధువు, జగన్‌కు రక్త సంబంధం లేదనే మాటే తప్ప, ఆయన గురించి అంతగా తపిస్తుంటారు రోజా.
అలాంటి రోజాకు నగరిలో సొంత పార్టీ నాయకుల నుంచి నిత్యం ఇబ్బందులే. వైసీపీ బలాన్నే తమ వ్యక్తిగత బలంగా భ్రమిస్తూ, కొందరు మండలస్థాయి నాయకులు రోజాకు వ్యతిరేకంగా మీడియాకెక్కి విమర్శలు చేస్తుండడం చర్చనీయాంశమైంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ పెద్దలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే… స్థానిక ఎమ్మెల్యేగా ఆమెకు తెలియకుండానే నామినేటెడ్ పదవులు కట్టబెడుతుంటారు. అలాగే రోజాకు సంబంధం లేకుండానే ఆమె వ్యతిరేకులైన పార్టీ నాయకులకు మైన్స్, ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాలు కలిగించేలా ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టారు.
గత ఐదేళ్లలో ఆర్థికంగా ప్రయోజనాలు పొందిన రోజా వ్యతిరేకులు, ఇప్పుడు ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు సిద్ధమంటూ బీరాలు పలుకుతున్నారు. సీఎం జగన్ కోసం ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు, బూతులు తిట్టించుకుంటూ, మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే అవమానాలు ఎదుర్కొంటున్న రోజా ఆవేదన వర్ణనాతీతం.
ప్రస్తుతం నగరిలో రోజా పరిస్థితి ఎలా వుందంటే… అక్క కూతురని తిట్టకూడదు, నిండు మనిషని కొట్టకూడదు అనే సామెత చందంగా తయారైంది. రోజా వ్యతిరేకులు ఎవరి అండ చూసుకుని అలా రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నగరి వైసీపీ మండల నాయకులపై చర్యలు తీసుకోడానికి పార్టీ పెద్దలకు దమ్ము లేదు. జగన్ విధేయులై, అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేసే అనామకులపై చర్యలు తీసుకోడానికి మాత్రం వైసీపీ పెద్దలు సిద్ధంగా వుంటారు.
కానీ వైసీపీ ఫైర్‌బ్రాండ్, జగన్ కోసం ప్రత్యర్థుల చేతల్లో అత్యంత నీచంగా అవమానానికి గురి అవుతున్న మంత్రి రోజాకు సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిస్తుంటే, కళ్లుండి చూడలేని కబోదుల్లా వైసీపీ పెద్దలు వ్యవహరిస్తున్నారని తిరుపతి జిల్లాలో విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుని, నగరిలో రోజా విజయానికి అడ్డంకులు సృష్టిస్తున్న సొంత పార్టీ నేతలను దారికి తేవడమా? లేక వేటు వేయడమా? ఏదో ఒకటి చేయాల్సిన తక్షణ అవసరం వుంది. లేదంటే నమ్మకం, విశ్వాసం అనే పదాలకు అర్థం లేకుండా పోతుంది.