ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమో.. వాలంటీర్లకు ఎడాపెడా వరాలు కురిపించేస్తున్నారు. తమ్ముళ్లూ మీకు యాభైవేల ఉద్యోగాలు, లక్షరూపాయల ఉద్యోగాలు ఇప్పిస్తా అని ప్రగల్భాలు పలుకుతున్నారు. తమ్ముళ్లూ మీకు నెల జీతం పదివేలకు పెంచేస్తా అని ఆల్రెడీ వాగ్దానం ఇచ్చేశారు.
చంద్రబాబు నాయుడు కుట్రలను తట్టుకోలేక ఒకవైపు వాలంటీర్లు కొందరు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం.. ప్రతి ప్రజా గళం సభలోనూ.. ఒక విడత వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ్ముళ్లూ మీరెవ్వరూ మీ పదవులకు రాజీనామా చేయవద్దు. నేను అధికారంలోకి రాగానే మీ అందరి జీతాలను పదివేలకు పెంచేస్తున్నా.. దాన్ని మీరెవ్వరూ కోల్పోవద్దు అని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మరొకవైపు నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పొంగులేటి నారాయణ మాత్రం.. అక్కడి వాలంటీర్లను రాజీనామా చేయించి వారందరికీ తెలుగుదేశం కండువాలు కప్పేస్తున్నారు. తాజాగా ఏకంగా వందమంది వాలంటీర్లు తెలుగుదేశంలో చేరే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. నాయకుడు ఒక రకంగా చెబుతుండగా, అభ్యర్థి మరొక రకంగా ప్రవర్తించడం.. ఏమిటీ డ్రామా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు రాజీనామాలు చేయొద్దు మహాప్రభో అని చంద్రబాబు మొత్తుకుంటున్నా కూడా.. వాలంటీర్లు ఇలా వందల సంఖ్యలో రాజీనామా చేసేస్తున్నారంటే దాని అర్థం ఏమనుకోవాలి? చంద్రబాబు చెబుతున్న మాటల మీద వారిలో ఏమాత్రం విశ్వాసం కలగడం లేదని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెబుతాడని వాలంటీర్లు విశ్వసిస్తున్నట్టుగా భావించాలి.
వాలంటీర్లలో వైసీపీ వైపు వెళ్లే వాళ్ల సంగతి ఒక ఎత్తు. చంద్రబాబు వద్దంటున్నా రాజీనామా చేసేసి వస్తే నారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరుతున్నారంటే ఏమనుకోవాలి. వాళ్లకి బాబు మీద నమ్మకం లేదు గానీ.. నారాయణ ఇచ్చే తాయిలాల మీద, ప్రలోభాల మీద మాత్రం నమ్మకం ఉందనుకోవాలి. ఇలాంటి డ్రామాలన్నీ తెలుగుదేశాన్ని ఎటువైపు తీసుకువెళతాయో చూడాలి.