అవస్థ తొలగలేదు సారూ.. దయపెట్టండి!

పెన్షన్ల విషయంలో చంద్రబాబు లబ్దిదార్లకు ఇచ్చిన హామీని సగమే నిలబెట్టుకున్నారు. పెన్షను కోసం ప్రతినెలా పరుగులు తీయాల్సి వచ్చే వారి అవస్థను మాత్రం ఆయన తొలగించనేలేదు. అవస్థను తొలగించాలనే తొలుత అనుకున్నారు. మాట ఇచ్చారు.…

పెన్షన్ల విషయంలో చంద్రబాబు లబ్దిదార్లకు ఇచ్చిన హామీని సగమే నిలబెట్టుకున్నారు. పెన్షను కోసం ప్రతినెలా పరుగులు తీయాల్సి వచ్చే వారి అవస్థను మాత్రం ఆయన తొలగించనేలేదు. అవస్థను తొలగించాలనే తొలుత అనుకున్నారు. మాట ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మర్చిపోయారు. పెన్షనర్లను ఊరించే లాగా చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో ఇంకా అనేకం చెప్పారు. అయితే పెంచిన మొత్తం ఇవ్వడం తప్ప మరొక మాట కూడా కార్యరూపంలోకి రావడం లేదు. సంక్షేమ పథకాల పెన్షనర్లకు ఇచ్చిన ఇతర హామీలను చంద్రబాబు నాయుడు కన్వీనియంట్ గా మరచిపోవడం వలన వారు అనేక కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు ఉండే రికార్డుల మీద మోజు వల్ల వారికి కొన్ని కొత్త రకాల పాట్లు ఎదురవుతున్నాయి.

ముందుగా పెన్షన్ను ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచి అందిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అభినందించాలి. అయితే ఒకటవ తేదీనే గరిష్టంగా అందరికీ పెన్షన్లు పంపిణీ చేసేశాం అని ఒక రికార్డుగా చాటుకోవాలని చంద్రబాబు నాయుడు కోరిక! ఈ నెలలో కూడా ‘అక్టోబర్ 1వ తేదీని 98 శాతం మందికి పెన్షన్లు అందజేశాం.. ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు’ అంటూ చంద్రబాబు నాయుడు చాలా ఘనంగా ప్రకటించుకున్నారు. ఆయనకు ఈ రికార్డుల మీద ఉన్న యావ కారణంగా క్షేత్రస్థాయిలో పెన్షనర్లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఒక ఊరిలో పెన్షన్ తీసుకుంటున్న వారు.. ఒకటోతేదీ నాటికి మరో ఊరికి గాని, తీర్థయాత్ర లాంటి వాటికి గానీ, ఆస్పత్రి అవసరాల నిమిత్తం గానీ, ఇంకో ఊరిలో ఉండే బిడ్డల వద్దకు గాని వెళ్లి ఉంటే వారికి అగచాట్లు ఎదురవుతున్నాయి. ఒకటవ తేదీ నాటికి ఖచ్చితంగా ఏ సచివాలయం పరిధిలో అయితే వారికి పెన్షన్ లభిస్తుందో, ఆ ప్రాంతానికి చేరుకుని తీరాల్సి వస్తున్నది. ఒకటవ తేదీ అందుబాటులో లేకపోతే అసలు పెన్షన్ ఇచ్చేది లేదు అన్నట్టుగా సిబ్బంది పెన్షనర్లను అనధికారికంగా బెదిరిస్తున్నారు.

గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకటి నుంచి నాలుగు ఐదు తేదీల వరకు పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉండేది. ఐదో తేదీలోగా నూరు శాతం పూర్తి చేసేవారు. దీనివలన లబ్ధిదారులు అవసరార్థం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉన్నప్పటికీ కూడా వారికి చిన్న వెసులుబాటు ఉండేది. అప్పటికీ కొందరు ఇబ్బందులు పడుతూ పెన్షన్ల కాలానికి ప్రతినెలా స్వస్థలాలకు చేరుకుంటుండేవారు.. పెన్షనర్లకు ఎదురయ్యే ఆ ఇబ్బందులను తీరుస్తానన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకమైన హామీని వెలువరించారు. పెన్షనర్లు వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా సరే మూడో నెలలో ఒకేసారి మొత్తం సొమ్మును వారికి అందజేయడం జరుగుతుంది- అని ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రకటించారు.

ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండే పెన్షనర్లు.. ఇతర ప్రాంతాల్లోని పిల్లల వద్ద కొంత సుదీర్ఘకాలం గడపడానికి ఇలాంటి ఏర్పాటు చాలా బాగుంటుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ మాట పక్కన పెట్టేశారు. సరి కదా ఒకటో తేదీ దాటితే రెండు మూడు తేదీలలో కూడా పెన్షన్ ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఒకటోతేదీనాటికి అందుబాటులో ఉండి తీరాల్సిందే అని సిబ్బంది హెచ్చరిస్తున్నట్లుగా లబ్ధిదారులు వాపోతున్నారు. ఎటొచ్చీ పెంచిన పెన్షన్లను ఇస్తూ ప్రజల మన్నన పొందుతున్న ప్రభుత్వం.. ఈరకమైన చిన్న చిన్న చికాకులు కలిగించడం ఎందుకు అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

7 Replies to “అవస్థ తొలగలేదు సారూ.. దయపెట్టండి!”

  1. నువ్వు రాస్తున్నఅంత ఏమీ లేదు అక్కడ. అందరూ ఒకటో తారీకు పెన్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు

Comments are closed.