ఎట్ట‌కేల‌కు పోలీసుల విచార‌ణ‌కు పేర్ని జ‌య‌సుధ‌

కొంత‌కాలంగా అరెస్ట్ నుంచి త‌ప్పించుకునేందుకు అజ్ఞాతంలో ఉన్న పేర్ని జ‌య‌సుధ …పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డం విశేషం.

మ‌చిలీప‌ట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జ‌య‌సుధ పేరుపై ఉన్న గోడౌన్ నుంచి రేష‌న్ బియ్యం మాయం కావ‌డంపై తీవ్ర రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. ఏడు వేల బ‌స్తాల‌కు పైగా బియ్యం మాయం అయ్యిన‌ట్టు పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ అధికారులు నిగ్గు తేల్చారు. ఇప్ప‌టికే ఒక ద‌ఫా రూ.1.70 కోట్లు పేర్ని జ‌య‌సుధ చెల్లించారు. దాదాపు అంతే సొమ్ము రెండు చెల్లించాల‌ని ఇప్ప‌టికే పేర్ని కుటుంబానికి నోటీసు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు బెయిల్ పొందిన పేర్ని జ‌య‌సుధను విచార‌ణ‌కు రావాలంటూ మ‌చిలీప‌ట్నం తాలూకా పోలీసులు నోటీసులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇవాళ మ‌ధ్యాహ్నం న్యాయ‌వాదుల‌తో క‌లిసి ఆమె పోలీసుల విచార‌ణ‌కు వెళ్లారు. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని బెయిల్ ష‌ర‌తులో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

పేర్ని కుటుంబంపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే నాని భార్య‌ను విచార‌ణ‌కు పిలిచార‌ని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే నేరానికి మ‌హిళా, పురుషుడు అనే తేడా ఏంట‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది. అయితే త‌న భార్య‌ను అరెస్ట్ చేసే విష‌య‌మై సీఎం చంద్ర‌బాబునాయుడు అంగీక‌రించ‌కుండా, ఒత్తిడి తెచ్చిన మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ను మంద‌లించిన‌ట్టు నాని తెలిపారు. ఈ విష‌య‌మై కూడా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా వుండ‌గా కొంత‌కాలంగా అరెస్ట్ నుంచి త‌ప్పించుకునేందుకు అజ్ఞాతంలో ఉన్న పేర్ని జ‌య‌సుధ …పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డం విశేషం. ఇవాళ్టితో విచార‌ణ పూర్త‌వుతుందా? లేక మున్ముందు వెళ్లాల్సి వుంటుందా? అనేది పోలీసుల నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి వుంటుంది.

One Reply to “ఎట్ట‌కేల‌కు పోలీసుల విచార‌ణ‌కు పేర్ని జ‌య‌సుధ‌”

Comments are closed.