ర‌క్షించాల్సినోళ్లే… చిచ్చుపెడితే ఎలా?

పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ ఆల‌య పూజారి గంగిరెడ్డిగారి మంజునాథ్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు.

పోలీసులంటే ప్ర‌జార‌క్ష‌కుల‌ని అర్థం. కానీ వాళ్లే ఉద్రిక్త‌త‌ల‌కు, గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మైతే, ఇక ప్ర‌జానీకం త‌మ గోడు ఎవ‌రికి చెప్పుకోవాలి? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌జ‌ల మ‌త విశ్వాసాలు, సంప్ర‌దాయాలు లాంటి సున్నిత అంశాల‌కు సంబంధించి అత్యంత చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాల్సి వుంటుంది. కానీ పోలీసులు, దేవాదాయ‌శాఖ అధికారులు దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది.

వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తాడిమ‌ర్రి మండలం చిల్ల‌వారిప‌ల్లెలో పోలీసులు, దేవాదాయ‌శాఖ అధికారులు అనాలోచితంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కుంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ గ్రామంలో శ్రీ‌కాటికోటేశ్వ‌ర‌స్వామి ఏడు వెండి గుర్రాల‌ను బ‌ల‌వంతంగా త‌ర‌లించ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నించ‌డాన్ని చిల్ల‌వారిప‌ల్లెవాసులంతా క‌లిసిక‌ట్టుగా అడ్డుకున్నారు.

అంతేకాదు, పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ ఆల‌య పూజారి గంగిరెడ్డిగారి మంజునాథ్‌రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. అలాగే మ‌రో ముగ్గురు గ్రామ‌స్తులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా గ్రామ‌స్తులు అడ్డుకున్నారు. దీంతో ప్ర‌మాదం త‌ప్పింది.

మ‌హాశివరాత్రి సంద‌ర్భంగా రెండురోజుల పాటు చిల్ల‌వారిప‌ల్లెలో వేడుక‌లు నిర్వ‌హిస్తారు. పూజారి నియామ‌కం విష‌య‌మై త‌లెత్తిన వివాదంలో రెవెన్యూ, పోలీస్‌, దేవాదాయ‌శాఖ అధికారులు అధికార కూట‌మి నేత‌ల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవ‌డంతో వివాదం త‌లెత్తింద‌ని గ్రామ‌స్తులు చెప్తున్నారు. చివ‌రికి ఆ గ్రామానికి గ‌త రాత్రి ఎస్పీ వి.ర‌త్న వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

3 Replies to “ర‌క్షించాల్సినోళ్లే… చిచ్చుపెడితే ఎలా?”

Comments are closed.