బాబును వ‌దులుకోడానికి సిటింగ్ ఎమ్మెల్యే సిద్ధం!

తెలివితేట‌లు అంద‌రికీ వుంటాయ‌ని చంద్ర‌బాబు అనుకోరు. అందుకే ఆయ‌న ఏవేవో మాట్లాడుతుంటారు. తాను ఏం చెప్పినా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని చంద్ర‌బాబునాయుడు భ్ర‌మ‌లో వుంటారు. అయితే టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు తాను చెప్పింద‌ల్లా…

తెలివితేట‌లు అంద‌రికీ వుంటాయ‌ని చంద్ర‌బాబు అనుకోరు. అందుకే ఆయ‌న ఏవేవో మాట్లాడుతుంటారు. తాను ఏం చెప్పినా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని చంద్ర‌బాబునాయుడు భ్ర‌మ‌లో వుంటారు. అయితే టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు తాను చెప్పింద‌ల్లా వినే ప‌రిస్థితి లేద‌ని ఆయ‌న‌కు తెలియ‌జెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నారు.

ఉండి అసెంబ్లీ సీటుపై ర‌చ్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఉండి సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజు పేరు ముందే ప్ర‌క‌టించారు. అయితే న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు సీటు విష‌యంలో చంద్ర‌బాబు ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. బీజేపీ త‌ర‌పున ఆయ‌న‌కు సీటు ద‌క్కుతుంద‌ని అంద‌రూ ఊహించారు. అయితే బీజేపీలో సుదీర్ఘ కాలంగా ప‌ని చేస్తున్న కార్య‌క‌ర్త శ్రీ‌నివాస్ వ‌ర్మ‌కు ఎంపీ టికెట్ ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌కృష్ణంరాజు టికెట్ బాధ్య‌త‌ను చంద్ర‌బాబు తీసుకోవాల్సి వ‌చ్చింది. టీడీపీ కంచుకోట అయిన ఉండి సీటును ఆయ‌న‌కు ఇచ్చేందుకు చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో క్ష‌త్రియ ఓట‌ర్లు ఎక్కువ‌. దీంతో ర‌ఘురామ‌కృష్ణంరాజు గెలుపు న‌ల్లేరు న‌డ‌కే అని చంద్ర‌బాబు న‌మ్మారు. కానీ సిటింగ్ ఎమ్మెల్యే రామ‌రాజు త‌న‌ను త‌ప్పించ‌డాన్ని ఏ మాత్రం అంగీక‌రించ‌డం లేదు.

రామ‌రాజు అనుచ‌రులు సిటింగ్ ఎమ్మెల్యేను కాద‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజుకు టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అమ‌లాపురంలో తాను బ‌స చేసిన ప్రాంతానికి రామ‌రాజును చంద్ర‌బాబు పిలిపించుకున్నారు. రామ‌రాజుతో పాటు ఆయ‌న అనుచ‌రుల‌తో బాబు స‌మావేశ‌మ‌య్యారు. త‌న‌దైన స్టైల్‌లో రామ‌రాజును ఒప్పించేందుకు బాబు మాట‌లు చెప్పారు.

రామ‌రాజుకు ఏం న్యాయం చేయాలో ఆలోచిస్తున్నామ‌ని చంద్ర‌బాబునాయుడు అన్నారు. రామ‌రాజును వ‌దులుకోలేనంటూ కార్య‌క‌ర్త‌ల‌తో చంద్ర‌బాబు అన్నారు. రామ‌రాజు ఎన్నిక‌ల్లో బాగా ప‌ని చేశార‌ని, ఆయ‌న త‌న సొంత మ‌నిషి అని, అత‌ని టికెట్ త‌న సొంత విష‌య‌మ‌ని బాబు చెప్పుకొచ్చారు. ఒకవైపు అభిమానం చూపిస్తూ సీటుపై స‌స్పెన్స్ ఎందుకు అని కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నించారు. దీంతో చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

రెండు రోజుల్లో నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాన‌ని, స‌మ‌స్య‌ను త‌న‌కు వ‌దిలేయాల‌ని బాబు అన్నారు. బాబుతో స‌మావేశం త‌ర్వాత మీడియాతో రామ‌రాజు మాట్లాడారు. పార్టీ ఆలోచ‌న‌, చంద్ర‌బాబు నిర్ణ‌యం మేర‌కు త‌న కార్యాచ‌ర‌ణ వుంటుంద‌ని రామ‌రాజు స్ప‌ష్టం చేశారు. రామ‌రాజును చంద్ర‌బాబు వ‌దులుకోవాల‌ని లేన‌ప్ప‌టికీ, త‌న సీటుకు ఎస‌రు పెడితే మాత్రం టీడీపీలో కొన‌సాగ‌డానికి ఉండి సిటింగ్ ఎమ్మెల్యే సిద్ధంగా లేర‌ని స్ప‌ష్ట‌మైంది. ఇదే విష‌యాన్ని రామ‌రాజు ప‌రోక్షంగా చెప్పారు.