ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. తన వ్రచారం వల్ల ముఖ్యమంత్రి, తన అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వణికిపోతున్నారని ఆమె భ్రమిస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ జిల్లాలో ప్రస్తుతం ఆమె ప్రచారం చేస్తున్నారు.
ఇందులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరులో నిర్వహించిన ప్రచార యాత్రలో షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ్టికి తన యాత్ర ఐదో రోజుకు చేరిందన్నారు. దీంతో కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిని మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోందని అన్నారు. అంటే వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి దోషి అని ఒప్పుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించడం గమనార్హం.
అభ్యర్థి ఎవరైనా వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ అయిన తనను ఎన్నుకోవాలని ఆమె అభ్యర్థించారు. తాను ఇక్కడి బిడ్డనే అని చెప్పుకోడానికి ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. జమ్మలమడుగులోని క్యాంబెల్ ఆస్పత్రిలో రాజశేఖరరెడ్డి పుట్టారని ఆమె అన్నారు. తాను కూడా అక్కడే పుట్టినట్టు షర్మిల చెప్పుకొచ్చారు. తన ప్రచారంతో ఏకంగా అవినాష్‌రెడ్డిని మారుస్తారని ఆమె కలలు కనడం గమనార్హం. కడపలో రాజకీయం పూర్తిగా మారిపోతుందనే భ్రమలో షర్మిల ఉన్నారు.
ఇదిలా వుండగా షర్మిల ప్రచారానికి జనం నుంచి స్పందన కొరవడింది. ప్రసంగంలో భాగంగా షర్మిల అడుగుతున్న ప్రశ్నలకు జనం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఇవాళ్టితో కడప జిల్లా పర్యటన పూర్తి చేసుకోనున్నారు. ఆదివారం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు.