జీవీరెడ్డి లాంటోళ్ల‌ను పోగొట్టుకోవ‌డంతోనే అసంతృప్తి!

పొత్తులో భాగంగా కొంద‌రికి నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్క‌డం లేదు. దీంతో వాళ్లంతా నిరాశ‌నిస్పృహ‌ల‌కు గుర‌వుతున్నారు.

“ఔను, మా పార్టీ కేడ‌ర్‌లో అసంతృప్తి వుంది. పొత్తులో భాగంగా కొంద‌రికి నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్క‌డం లేదు. దీంతో వాళ్లంతా నిరాశ‌నిస్పృహ‌ల‌కు గుర‌వుతున్నారు. మాది కార్య‌క‌ర్త‌ల పార్టీ. త్వ‌ర‌లోనే అన్నీ స‌ర్దుకుంటాయ్” అని ఇటీవ‌ల టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు అనడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌జ‌ల్లో అసంతృప్తి వుంటే, ఏదో రకంగా ఎన్నిక‌ల నాటికి తిరిగి త‌మ వైపు తిప్పుకోవ‌చ్చు. కానీ రాజ‌కీయ పార్టీల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో అసంతృప్తి ఒక్క‌సారి మొద‌లైతే మాత్రం, అదే వ్య‌తిరేక‌త‌గా మారి, ఓట‌మికి దారి తీస్తుంద‌నేందుకు ఎన్నైనా ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకోవ‌చ్చు. 2019లో టీడీపీ, 2024లో వైసీపీ ఘోర ప‌రాజ‌యాల‌కు కేడ‌ర్‌లో అసంతృప్తే కార‌ణ‌మ‌ని తెలిసిందే.

ప‌ది నెల‌ల కాలంలోనే టీడీపీలో ఎందుకు అసంతృప్తి? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం క‌ళ్లెదుటే వుంది. ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ ప‌ద‌వికి, అలాగే టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన జీవీరెడ్డి ఉదంతాన్ని లోతుగా అధ్య‌య‌నం చేస్తే, టీడీపీలో ఎందుకు అసంతృప్తి జ్వాల చెల‌రేగుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మంచి ప‌ద‌వి అంటే ప‌ది రూపాయ‌లు సంపాదించుకునే ఆదాయ వ‌న‌రులున్నద‌ని అర్థం. జీవీరెడ్డికి ద‌క్కిన ఫైబ‌ర్‌నెట్ కార్పొరేష‌న్ ఆదాయ వ‌న‌రున్న సంస్థ‌.

అయితే ఆ ప‌ద‌విని ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఉప‌యోగించి, టీడీపీని బ‌లోపేతం చేసేందుకు వాడుకోవాల‌ని జీవీరెడ్డి ఆలోచించ‌డ‌మే నేర‌మైంది. అవినీతికి కొమ్ము కాస్తున్న ఐఏఎస్ అధికారితో పాటు మ‌రో ముగ్గురు ఉద్యోగుల విష‌య‌మై ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్లినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దీంతో ప్ర‌భుత్వం ఎవ‌రి ప‌క్ష‌మో జీవీరెడ్డికి చాలా త్వ‌ర‌గానే జ్ఞానోద‌యం అయ్యింది. అంతే, ఆ ప‌దవికి, పార్టీకి గుడ్ బై చెప్పారు.

మ‌రో ఉదాహ‌ర‌ణ కూడా చెప్పుకుందాం. పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను గెలిపించ‌డంలో వ‌ర్మ కీల‌క పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత వ‌ర్మ‌తో పాటు టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు పిఠాపురంలో వైసీపీ కంటే జ‌న‌సేన‌కు వ‌ర్మ‌, టీడీపీ కార్య‌క‌ర్త‌లే ప్ర‌ధాన శ‌త్రువుల‌య్యారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ర‌గిలిపోతోంది.

ప‌ద‌వులు, ఆదాయం కోసం అధికార పార్టీలోకి చేరేవాళ్ల‌ను చూస్తున్నాం. కానీ అందుకు విరుద్ధంగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలోకి వెళ్లి, మూడేళ్లకు పైగా అధికార వైసీపీపై పోరాడిన జీవీరెడ్డి లాంటోడిని, టికెట్ ఇవ్వ‌క‌పోయినా, బాబు ఆదేశాల‌ను గౌర‌వించి, మ‌రో పార్టీ అధ్య‌క్షుడి గెలుపు కోసం త‌న‌ను తాను త్యాగం చేసిన వ‌ర్మ‌ను అవ‌మానిస్తుంటే, టీడీపీ పెద్ద‌లు చోద్యం చూస్తుంటే, కార్య‌క‌ర్త‌ల్లో అసంతృప్తికి బ‌దులు ఆనందం ఎలా క‌లుగుతుంది.

టీడీపీని ప్రేమించే జీవీరెడ్డిని పోగొట్టుకున్న నాడే, అలాగే వ‌ర్మ‌లాంటోళ్లు అధికారంలో వుంటూ కూడా అవ‌మాన‌పాల‌వుతుంటే, ప‌ట్టించుకోక‌పోతే, వాటికి రానున్న రోజుల్లో త‌ప్ప‌క మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

6 Replies to “జీవీరెడ్డి లాంటోళ్ల‌ను పోగొట్టుకోవ‌డంతోనే అసంతృప్తి!”

  1. పరాయి వాడివైనా మంచి ఆర్టికల్ రాసినందుకు నీకు అభినందనలు. శుభం భూయాత్.

  2. పిఠాపురం వర్మ…తనకు టికెట్ దక్కలేదు అని తెలిసాక చేసిన అల్లరి అంతా ఇంత కాదు…చంద్రబాబు,లోకేష్ దిష్టి బొమ్మలు తగల బెట్టించాడు

    ధర్నాలు చేసి పెట్రోల్ సీసాలు పగలగొట్టిచాడు

    ఇలా నానా యాగీ చేశాడు…

    తర్వాత బాబు పిలిచి సుతి మెత్తగా మందలించాడు

    సో…నేను చెప్పేది ఏంటంటే వర్మ చేసిన అల్లరి అధిష్టానం మనసులో నెగిటివ్ గా ముద్రపడి ఉంటుంది…

    అలాంటప్పుడు పదవులు ఇవ్వబోయినా అతను చేసిన రచ్చ గుర్తుకు వస్తూనే ఉంటుంది…

    కాబట్టి వర్మకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని నా అభిప్రాయం…

  3. ఇది gv రెడ్డి మీద అభిమానం కాదు. ఇందులో ఇంకో అర్థం ఉంది

Comments are closed.