వైసీపీ నుంచి గుణ‌పాఠం నేర్వ‌ని కూట‌మి

నియంతృత్వం ఎక్కువ కాలం సాగ‌ద‌ని చ‌రిత్ర ఎన్నో పాఠాల్ని నేర్పింది.

సాగునీటి సంఘాల ఎన్నిక‌ల్లో 95 శాతం ప‌ద‌వులు త‌మ‌ వ‌శ‌మ‌య్యాయ‌ని కూట‌మి సంబ‌ర‌ప‌డుతోంది. అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రికైనా ఇట్లే అనిపిస్తూ వుంటుంది. ఇలాంటివి ప్ర‌త్య‌ర్థుల్లో ప‌ట్టుద‌ల పెంచుతుంటాయి. గ‌తంలో వైసీపీ నియంతృత్వంతో వ్య‌వ‌హ‌రించింద‌ని విమ‌ర్శించిన నోళ్లే, నేడు తాము అంత‌కంటే ఎక్కువ నిరంకుశ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో వైసీపీ దౌర్జ‌న్యాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించారు. ఎన్నిక‌లొచ్చే వ‌ర‌కూ ఎదురు చూశారు. వైసీపీకి ప్ర‌జ‌లు చెప్పిన గుణ‌పాఠం నుంచి కూట‌మి ఏమీ నేర్చుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. వినాశ‌కాలే విప‌రీత బుద్ధి అంటే ఇవే కాబోలు. ఈ మాట కూట‌మికి చేదు అనిపించొచ్చు. అధికారంలో ఉన్నాక‌, ఆ మాత్రం చేసుకోక‌పోతే ఎలా అని నియంతృత్వాన్ని ప్ర‌శ్నించిన వాళ్ల‌ను ద‌బాయించొచ్చు.

కానీ నియంతృత్వం ఎక్కువ కాలం సాగ‌ద‌ని చ‌రిత్ర ఎన్నో పాఠాల్ని నేర్పింది. దుర‌దృష్ట‌వ‌శాత్తు రాజ‌కీయ పార్టీల నాయ‌కులకు అవ‌న్నీ రుచించ‌వు. తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌నే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ప్ర‌తిదానికీ స‌మాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒక‌టొస్తుంది. అప్పుడు ల‌బోదిబోమన్నా ప‌ట్టించుకునే వారుండ‌రు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించాల‌నే పిలుపును ఎవ‌రు ప‌ట్టించుకుంటున్నారు? ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ల‌కు మాత్ర‌మే, దాని గురించి మాట్లాడే అర్హ‌త వుంటుంది.

ప్ర‌స్తుతం ఏ ఎన్నికైనా గెలుపు త‌ప్ప‌, ప్ర‌జాస్వామ్యం గురించి ఆలోచించే ప‌రిస్థితిలో కూట‌మి నేత‌లు లేరు. ఇవ‌న్నీ తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేవ‌ని తెలిసినా, వాళ్లు మాత్రం నియంతృత్వంగా వ్య‌వ‌హ‌రించ‌డానికే సిద్ధ‌మ‌య్యారు. చేయ‌గ‌లిగేదేమీ లేదు. చిత్ర‌గుప్తుడు పాపాల్ని కౌంట్ చేస్తున్న‌ట్టుగా, ప్ర‌జ‌లు అన్నీ మ‌న‌సులో పెట్టుకుంటారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఎలా గుణ‌పాఠం నేర్పాలో వాళ్ల‌కు బాగా తెలుసు. తెలియ‌క చేస్తే పొర‌పాటు. తెలిసి చేస్తే, త‌ప్పు అవుతుంది. త‌ప్పులు చేసిన వాళ్లు శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌దు. దీనికి మిన‌హాయింపులుండ‌వు.

5 Replies to “వైసీపీ నుంచి గుణ‌పాఠం నేర్వ‌ని కూట‌మి”

Comments are closed.