పాతపట్నంలో టీడీపీ రెబెల్ రాజకీయం!

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టికెట్ ని ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ భారీ స్థాయిలో బల ప్రదర్శన చేశారు. టీడీపీ హై కమాండ్ దృష్టికి రావాలనే ఆయన ఈ విధంగా…

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టికెట్ ని ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ భారీ స్థాయిలో బల ప్రదర్శన చేశారు. టీడీపీ హై కమాండ్ దృష్టికి రావాలనే ఆయన ఈ విధంగా చేశారు. వేలాది మంది అభిమానులు అనుచరులతో కలమట బల ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా కలమట మాట్లాడుతూ తమ కుటుంబం పాతపట్నంలో యాభై ఏళ్ళు పైగా రాజకీయం చేస్తూ వస్తోందని గుర్తు చేశారు.

తన తండ్రి కలమట మోహన రావు అయిదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే తాను ఒకసారి గెలిచాను అని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబం ప్రజలకు సేవ చేయడం తప్ప అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. అదే చేస్తే కనుక అన్ని సార్లు తమ కుటుంబాన్ని ప్రజలు గెలిపించరు అని ఆయన అన్నారు.

తనకు టికెట్ రాకుండా చేసింది ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు, జిల్లా ప్రెసిడెంట్ కూన రవికుమార్ అని ఆయన ఆరోపించారు. వారి నియోజకవర్గాలలో కాపులు ఎలా ఓటేస్తారో చూస్తామని ఆయన సవాల్ చేశారు. తన విషయంలో హై కమాండ్ తొందరలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలలో ఎవరికి బలం ఉంది అన్నది తనతో పాటు వచ్చిన వేలాది జనమే నిదర్శనం అన్నారు.

ఇదే తీరున హై కమాండ్ వ్యవహరిస్తే మాత్రం తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమని కలమట స్పష్టం చేశారు. పాతపట్నం రాజకీయ ముఖ చిత్రం నుంచి కలమట ఫ్యామిలీని తప్పించే కుట్ర సాగుతోదని ఆయన ఆరోపించారు. అందుకే రాజకీయ పోరాటం చేస్తున్నానని తాను ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటాను అని ఆయన స్పష్టం చేస్తున్నారు.

బలమైన సామాజిక వర్గానికి చెందిన కలమట తీసుకోబోయే నిర్ణయం మీద ఇపుడు జిల్లా వ్యాప్తంగా టీడీపీలో చర్చ సాగుతోంది. ఆయన కనుక రెబెల్ గా పోటీ చేస్తే శ్రీకాకుళంలోని పలు అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీటుకు కూడా భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది అని అంటున్నారు. కలమట ఇపుడు టీడీపీ హై కమాండ్ కి టైం ఇచ్చారు.

ఆయన దేనికీ రాజీపడను టికెట్ ఇవ్వాల్సిందే అంటున్నారు. ఆ విషయంలో కనుక మార్పు ఉంటేనే ఆయన ఆగ్రహం చల్లారుతుంది అని అంటున్నారు. అది జరిగే పనేనా అన్నది ఇపుడు టీడీపీ శిబిరంతో పాటు అంతా ఆసక్తిగా చర్చిస్తున్నారు. కలమటకు టికెట్ నిరాకరించడంతో జిల్లా టీడీపీలో వర్గ పోరు కూడా బయట పడినట్లు అయింది అంటున్నారు.