కుటుంబ బంధాల్లో నిప్పులు పోస్తున్న తెదేపా కుట్రలు!

కుటుంబంలో ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన.. వారి బంధువర్గంలో ఎవ్వరూ ఎలాంటి రాజకీయ ఆసక్తిని కలిగి ఉండకూడదా? ఒకవేళ అలా రాజకీయ ఆసక్తులు ఉంటే.. ఎన్నికల సమయంలో.. తమ కుటుంబంలోని వారితో…

కుటుంబంలో ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన.. వారి బంధువర్గంలో ఎవ్వరూ ఎలాంటి రాజకీయ ఆసక్తిని కలిగి ఉండకూడదా? ఒకవేళ అలా రాజకీయ ఆసక్తులు ఉంటే.. ఎన్నికల సమయంలో.. తమ కుటుంబంలోని వారితో పూర్తిగా దూరంగా ఉండాలా? కుటుంబబంధాలను మంటగలిపేసి.. నిషేధాజ్ఞలు విధించుకోవాలా? తెలుగుదేశం పార్టీ ధోరణి చూస్తే అలాగే కనిపిస్తోంది.

ఉన్నతాధికారి కుటుంబంలోని సభ్యుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొని, సదరు అధికారి ఇంటికి వెళ్లి భోజనం చేయడాన్నే పెద్ద నేరంగా ప్రొజెక్టు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ నాయకుడు వర్ల రామయ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం విశేషం.

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలో తిరులేశ్వరరెడ్డి ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన మామ గురవారెడ్డి గతంలో జడ్పీటీసీగా కూడా పనిచేశారు. ఆయన విజయసాయిరెడ్డితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని, ప్రచారం ముగిసిన తర్వాత.. ఆయన సహజంగానే అల్లుడి ఇంటికి వెళుతున్నారు. అయితే ఇదే పెద్ద నేరమట. మామ, సొంత అల్లుడి ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేసి, అక్కడ వసతి పొందితే.. ఆ అల్లుడు రాజకీయంగా కుమ్మక్కు అయినట్టేనట! కాబట్టి నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డిని విధులనుంచి తప్పించాలని, మళ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలని వర్ల రామయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

చంద్రబాబునాయుడు అధికారం మీది అత్యాశతో కుటుంబ బంధాలకు విలువ ఇచ్చే మనిషి కాకపోవచ్చు. కానీ.. రాష్ట్రంలో ఎవ్వరూ తమ కుటుంబాలతో సఖ్యంగా ఉండకూడదని కోరుకుంటే ఎలా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నంత మాత్రాన.. తన బంధువులను, సొంత మామను ఇంటికి రానివ్వకుండా మడి కట్టుకుని కూచోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నీచమైన బుద్ధులను మానుకోవాలని హితవు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రతిరోజూ ఏదో ఒక ఫిర్యాదుతో ఎన్నికల ప్రధాన అధికారి వద్దకు వెళ్లడం ఒక కార్యక్రమంగా పెట్టుకుంది. ప్రజల్లో గెలిచే దమ్ములేని, కాగితపు పులులు, మాటల శూరులు అయిన వర్ల రామయ్య లాంటి నాయకులకు ఇంకేం పనిలేదు గనుక.. ఈ బాధ్యత భుజానకెత్తుకున్నారు. ప్రతిరోజూ వెళ్లడం.. ఏదో ఒక ఫిర్యాదు చేయడమే వారి నిత్యకృత్యం. దీనిద్వారా ప్రజల్లో తమ పార్టీనే చులకన చేస్తున్నారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.