ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తెలంగాణ రాజకీయాలు ప్రతిరోజూ హాట్ హాట్ గానే ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుంచి ఈ ప్రభుత్వం కూలిపోబోతున్నది అంటూ అటూ భారాస, ఇటు బిజెపి నాయకులు పదేపదే చెబుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి వారికి అంకంటె ఘాటుగా కౌంటర్లు ఇస్తూ వచ్చారు. ఈలోగా పార్లమెంటు ఎన్నికల సీజను రాగానే.. భారాస నుంచి కాంగ్రెసులోకి, బిజెపిలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. అవి ఇంకా కొనసాగుతున్నాయి.
తమాషా ఏంటంటే.. ఎక్కువ వలసలు కాంగ్రెస్ వైపే జరుగుతున్నాయి. చూడబోతే.. రాష్ట్రంలో తమ హవా సాగాలని కోరుకునే వారు కాంగ్రెసులోకి, ఢిల్లీ కేంద్రంగా దందాలు నడిపించాలనుకునేవారు బిజెపిలోకి భారాస నుంచి వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. బిజెపి, కాంగ్రెస్ నేతల మధ్య ఇప్పుడు.. పరస్పరం పార్టీలు మారడం గురించి మంతనాలు జరిగినట్టుగా ఆరోపణలు, వాటిని నిరూపించాలనే సవాళ్లు వినిపిస్తున్నాయి.
చేరికలన్నీ ముమ్మరంగా కాంగ్రెసు వైపు మాత్రమే జరుగుతుండడంతో భాజపా నాయకుల్లో అసహనం కలిగిందో ఏమో మరి. తమ పార్టీ వేస్తున్న గేలానికి జంపింగ్ చేపలు చిక్కడం లేదని బాధపడ్డారో ఏమో గానీ.. మొత్తానికి కాంగ్రెసు మీద కాస్త అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు.
బిజెపి ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెసు పార్టీనుంచి అయిదుగురు మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని, పార్టీని చీల్చి షిండే పాత్ర పోషించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలోని అమిత్ షా, నితిన్ గడ్కరీలతో చర్చించారని ఒక మాట వదిలేశారు. దీనిపై రాద్ధాంతం అవుతోంది. దీనికి కౌంటరుగా.. తాను చచ్చేవరకు కాంగ్రెసు జెండాతోనే చస్తానని, పార్టీ మారే ప్రసక్తే లేదని అంటూ కోమటిరెడ్డి రెచ్చిపోయారు.
భాజపానుంచి మహేశ్వరరెడ్డే.. మంత్రి పదవి ఇచ్చేట్లయితే తాను కాంగ్రెసులోకి వస్తానని తనను సంప్రదించాడని, తమకు సరిపడా సభలో బలం ఉన్నది గనుక.. అవసరం లేదని చెప్పానని ఆయన కౌంటర్ ఆరోపణలు చేశారు. ఇలా పార్టీ మారే లోపాయికారీ ఒప్పందాల గురించి ఒకరి మీద మరొకరు నిందలు వేసుకోవడం తమాషా.
అయితే తాను సంప్రదించినట్టుగా చెబుతున్న నితిన్ గడ్కరీ, అమిత్ షాలను తీసుకువస్తే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాలు కూడా విసిరారు. అమిత్ షా, గడ్కరీలను తీసుకురావడం గురించి సవాలు విసిరారే తప్ప.. మహేశ్వరరెడ్డి తనను సంప్రదించినట్టుగా ఆయన చేసిన ఆరోపణ మీద… ఆ ఇద్దరు నాయకులూ కలిసి అదే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి ఎందుకు సవాలు చేయలేదో తెలియదు.
నాయకులు అవతలి జట్టులోకి గెంతు వేసే వరకు ఎవ్వరి మాటలనూ నమ్మలేని రోజులు ఇవి. అయితే పార్టీలు మారడానికి లోపాయికారీ మంతనాల గురించి పుకార్లు, వాటి మీద ఆధారపడి సవాళ్లు అనేవి ప్రజలకు చిత్రంగా కనిపిస్తున్నాయి.