టీడీపీ స‌వాల్‌.. తిరుప‌తిలో జ‌రిగిందిదే!

మొత్తం వ్య‌వ‌హారంలో టీడీపీ అభాసుపాలైంది. స‌వాల్ విసిరిన టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు అడ్ర‌స్ లేరు

ఎస్వీ గోశాల‌లో గోవుల మృతిపై టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు ఒక్క‌సారిగా తిరుప‌తిలో రాజ‌కీయాల్ని వేడెక్కించాయి. ఇవాళ 10 గంట‌ల‌కు ఎస్వీ గోశాల‌కు రావాల‌ని, అక్క‌డ నిజాలేంటో చూపుతామ‌ని వైఎస్ జ‌గ‌న్‌, అలాగే భూమ‌న‌కు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాసరావు స‌వాల్ విసిరారు. ఈ స‌వాల్‌ను భూమ‌న స్వీక‌రించారు.

ఎస్వీ గోశాల‌కు వెళ్లాల‌ని భూమ‌న నేతృత్వంలో వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్ర‌య‌త్నించాయి. అయితే పోలీసులు ఇంటి ద‌గ్గ‌రే భూమ‌న‌తో పాటు తిరుప‌తి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, నారాయ‌ణ‌స్వామి, తిరుప‌తి, చంద్ర‌గిరి వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు భూమ‌న అభిన‌య్‌, చెవిరెడ్డి మోహిత్‌ల‌ను అడ్డుకున్నారు. దీంతో చాలా సేపు రోడ్డుపైనే భూమ‌న‌, గురుమూర్తి, నారాయ‌ణ‌స్వామి ప‌డుకుని నిర‌స‌న తెలిపారు.

పోలీసుల నుంచి అనుమ‌తి రాక‌పోవ‌డంతో వాళ్లంతా త‌మ పార్టీ కార్యాల‌యంలో కూచున్నారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌గిరి, శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యేలు పులివ‌ర్తి నాని, బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి స‌వాల్ స్వీక‌రించిన భూమ‌న‌కు ఫోన్ చేశారు. “అన్నా మేము మీ కోసం ఎదురు చూస్తున్నాం. వ‌స్తే మాట్లాడుకుందాం” అని వాళ్లిద్ద‌రు అన్నారు.

ఇందుకు భూమన స్పందిస్తూ.. “మ‌మ్మ‌ల్ని పోలీసులు అడ‌గ‌డుగునా అడ్డుకుంటున్నారు. గోశాల‌కు వ‌చ్చేందుకు అనుమ‌తించ‌డం లేదు. మేము అక్క‌డికి రావ‌డానికి సిద్ధం. మీరు ఎస్కార్ట్‌ను పంపితే వ‌స్తాం” అని అన్నారు. మీ చుట్టూ పోలీసులెవ‌రూ లేరే అని బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి అన‌డంతో భూమ‌న ఆయ‌న‌కు చీవాట్లు పెట్టారు. గ‌త రాత్రి నుంచే త‌న ఇంటిని పోలీసులు చుట్టుముట్టార‌ని అన్నారు.

అనంత‌రం భూమ‌న నేతృత్వంలో మ‌ళ్లీ గోశాల‌కు వెళ్ల‌డానికి అంతా క‌దిలారు. కానీ మ‌ళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఒక‌వైపు త‌న‌కు ఎమ్మెల్యేలు నాని, సుధీర్ ఫోన్ చేసి, రావాల‌ని పిలిచారంటూ, కాల్ రికార్డింగ్‌ను పోలీస్ అధికారుల‌కు వినిపించారు. అస‌లు పోలీసులే అడ్డుకోలేద‌ని కూడా అంటున్న విష‌యాన్ని వాళ్ల‌కు చెప్ప‌డంతో పాటు వినిపించారు. త‌మ‌ను అడ్డుకోవ‌డం ప‌ద్ధ‌తి కాద‌ని అన్నారు. కానీ పోలీసులు వినిపించుకోలేదు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని మీడియా త‌మ కెమెరాల్లో రికార్డ్ చేసింది.

ఇదే సంద‌ర్భంలో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి, తిరుప‌తి స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమ‌న అభిన‌య్ పోలీసుల క‌న్నుగ‌ప్పి ఎస్వీ గోశాల వ‌ద్ద‌కెళ్లారు. అభిన‌య్‌ని పోలీసులు అడ్డుకుని, ఎస్వీ యూనివ‌ర్సిటీ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేవ‌లం తిరుప‌తి ఎంపీ గురుమూర్తినే లోప‌లికి అనుమ‌తించారు.

వైసీపీ లేవనెత్తిన అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆ ప‌ని చేయ‌క‌పోగా, తిరుప‌తి ఎంపీతో వాద‌న‌కు దిగ‌డం గ‌మ‌నార్హం. స‌వాల్ విసిరి రాలేదేంట‌ని ఎంపీని నిల‌దీశారు. మీరొచ్చిన‌ట్టుగానే భూమ‌న కూడా రావ‌చ్చు క‌దా? అంటూ ఎంపీతో వితండ వాదం చేశారు. క‌నీసం స‌మాజం అన్నీ చూస్తోంద‌న్న స్పృహ కూడా లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో టీడీపీ అభాసుపాలైంది. స‌వాల్ విసిరిన టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు అడ్ర‌స్ లేరు. ఆయ‌న‌కు మీడియా ఎదుటే భూమ‌న ఫోన్ చేశారు. స‌వాల్‌కు తాను సిద్ధంగా ఉన్నాన‌ని, మీరెక్క‌డ అని ప్ర‌శ్నించారు. అటు వైపు నుంచి వాయిస్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప‌రువు పోతుంద‌ని భావించిన టీడీపీ, జ‌న‌సేన అధిష్టానాలు… పోలీసుల్ని అడ్డం పెట్టుకుని డ్రామా న‌డిపించిన‌ప్ప‌టికీ, ర‌క్తి క‌ట్ట‌లేద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

7 Replies to “టీడీపీ స‌వాల్‌.. తిరుప‌తిలో జ‌రిగిందిదే!”

  1. ఆవుల మరణాల పైన ఇంత జరుగుతున్నసంతలో శాంతమ్మ మాత్రం రావడం లేదు ,, ఎందుకు రాలేదు అంటే మా వాడికి జ్వరం వస్తుంది అంటారు ,,

    1. మరి రెండు నెలల్లో 35 ఎందుకు ఎలా చనిపోయాయి? ఆ 35 కూడా చనిపోకుండా ఎందుకు ఆపలేక పోయారు? అంటే వైసిపి ప్రకారం నెలకు ఇన్ని చనిపోతే తప్పు లేదు ఇన్ని మాత్రమే చనిపోవాలి అని ఏమైనా డిసైడ్ చేశారా? గుడి సెట్టు వేసుకొని పండగ పూజలు చేసుకున్న రోజున ఏ తప్పు కనిపించ లేదు ఈ భూమనకు కానీ సహజంగా ఆవులు చనిపోతే మాత్రం పొడుచుకు వస్తోంది.

Comments are closed.