జనసేన రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో ఒక ఎంపీ అభ్యర్థి తన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై అసహనంగా ఉన్నట్టు సమాచారం. అలాగే ఆయన అనుచరులు కూడా పవన్‌పై మండిపడుతున్నారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి కూటమి తరపున జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.
నాలుగు రోజుల క్రితం పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను పరిచయం చేశారు. 2029లో ఉదయ్‌ని ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకున్నట్టు చెప్పారు. అయితే అతని పనితీరు చూసి, ఇప్పుడే కాకినాడ ఎంపీగా నిలబెట్టేందుకు నిర్ణయించారన్నారు.
ఈ సందర్భంలో కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. చలమశెట్టి సునీల్ తనకు సన్నిహితుడే, ఫ్రెండే అని పవన్ చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు కనిపించినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటుంటామన్నారు. కానీ ఎన్నికల ముందు అతను వస్తుంటాడు, తర్వాత పోతుంటాడని పవన్ అన్నారు. అయితే తంగెళ్ల ఉదయ్, ఆయన అనుచరుల ఆవేదన ఏంటంటే… తనను ఎంపీ అభ్యర్థిగా పరిచయం చేస్తూ, ప్రత్యర్థి గురించి పార్టీ అధ్యక్షుడు సానుకూల కామెంట్స చేయడం ఏంటనే ప్రశ్న వస్తోంది.
రాజకీయాలపై కనీస అవగాహన లేకపోవడం వల్లే పవన్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని, దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కాకినాడ ఎంపీ, ఆయన అనుచరులు ఆఫ్ ది రికార్డు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా మాట్లాడాలో పవన్‌కు ఎవరు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. చలమశెట్టి సునీల్‌పై పవన్ పాజిటివ్ కామెంట్స్‌ను వైసీపీ రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకుంటోందని ఉదయ్ వాపోతున్నారు. వ్యక్తిగతంగా తనకెంత సన్నిహితమైన బహిరంగంగా మాట్లాడే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఎలా అని పవన్‌పై మండిపడుతున్నారు.