వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టికెట్ ఆశించి టీడీపీ ఇన్‌చార్జ్ జీ.ప్రవీణ్‌రెడ్డి భంగపడ్డారు. లోకేశ్ సిఫార్సును కాదని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి చంద్రబాబునాయుడు టికెట్ ఖరారు చేశారు. దీంతో టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేతో కలిసి నడవడానికి ఇష్టపడలేదు. ప్రవీణ్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. చంద్రబాబు తనకు టికెట్ ఖరారు చేశారని, మద్దతు ఇవ్వాలని ప్రవీణ్‌ను వరదరాజులరెడ్డి కోరినప్పటికీ, అతను పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై పోరాటం చేసి, జైలుపాలైన ప్రవీణ్, ఇప్పుడు కీలక సమయంలో మౌనవ్రతంలో ఉండడం చర్చనీయాంశమైంది. టీడీపీలో ఎవరెన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే, వారికే ప్రాధాన్యం వుంటుందని లోకేశ్ చెప్పిన మాటల్ని నమ్మి, ప్రవీణ్ దూకుడు ప్రదర్శించారు. ప్రవీణ్‌పై 10 కేసుల వరకూ నమోదు అయ్యాయి. కొన్ని కేసుల్లో ఆయన నెలల తరబడి జైల్లో గడిపారు.
అయితే ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు యాక్టీవ్ అయిన వరదరాజులరెడ్డి, టికెట్‌ను ఎగేసుకెళ్లారు. దీంతో ప్రవీణ్‌కు దిమ్మతిరిగింది. రాజకీయాలకు కొత్త అయిన యువ నాయకుడికి ఈ పరిణామం మింగుడు పడలేదు. ప్రవీణ్‌కే టికెట్ అని రెండుమూడు సార్లు స్వయంగా లోకేశ్ కడప, ప్రొద్దుటూరు పర్యటనలలో చెప్పారు.
అయితే మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా ప్రవీణ్‌కు టికెట్ దక్కలేదు. దీంతో ప్రవీణ్ కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీకి కష్టపడి పని చేస్తే టికెట్లు ఇవ్వరని, దానికో ఇంకో లెక్క వుంటుందని ప్రవీణ్‌కు అర్థమై వుంటుంది.