దూరదర్శన్ వచ్చిన తొలిరోజుల్లో విన సొంపైన కంఠంతో వార్తలు చదువుతూ, తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన శాంతి స్వరూప్ కన్నుమూశారు. భౌతికంగా ఇక ఆయన లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.
కానీ మృత్యువుపై పోరాటంలో ఆయన ఓడిపోయారు. చికిత్స పొందుతూ శుక్రవారం చివరి శ్వాస విడిచారు. శాంతి స్వరూప్ అంటే దూరదర్శన్, టీవీ అంటే శాంతిస్వరూప్ అనేంతగా ఆయన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్రవేశారు.
1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ఆరంభించారు. నమస్కారం… ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అంటూ చదవడం ప్రారంభించేవారు. 2011లో పదవీ విరమణ చేశారు. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు.
శాంతి స్వరూప్ గొప్పతనం ఏంటంటే.. దూరదర్శన్ వచ్చిన తొలిరోజుల్లో ఇప్పట్లా టెలీ ప్రాంప్టర్ వుండేది కాదు. దీంతో వార్తలు రాసుకున్న పేపర్లను ముందు పెట్టుకుని తప్పుల్లేకుండా చదివి, అందరి మన్ననలు పొందారు.
ఇటీవల ఆయన పలు యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, మళ్లీ నాటి తియ్యటి మధురానుభవాలను పంచుకున్నారు. ఈ తరం యాంకర్లకు ఆయన విలువైన సలహా ఇచ్చారు. వార్తలు చదవకండి. వార్తలు చెప్పండి అని శాంతి స్వరూప్ నేటి తరం న్యూస్ రీడర్లకు సలహా ఇవ్వడం గమనార్హం. ఆయన మృతికి పలువురు నివాళులర్పించారు.