జనసేనాని పవన్‌కల్యాణ్ విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో భ్రమలు తొలగిపోయాయి. ఇంతకాలం వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు పల్లకీ మోయడానికే తప్ప, తాను సీఎం కావడం పవన్‌కల్యాణ్ ఆశయం కాదనే నిర్ధారణకు వారు వచ్చారు. పొత్తులో భాగంగా దక్కించుకున్న 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లలో కూడా నిఖార్పైన జనసేన నాయకుల్ని నిలబెట్టలేకపోయారని తేటతెల్లమైంది.
కనీసం ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి చేరిన వాళ్లకు టికెట్లు ఇవ్వడాన్ని సమర్థించుకోవచ్చని, మిత్రపక్షమైన టీడీపీ నేతలకు నిస్సిగ్గుగా సీట్లు ఇవ్వడం ఏంటని జనసేన నాయకులు, కార్యకర్తలు నిలదీస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఇంతలా దిగజారుతారని కలలో కూడా ఊహించలేదని వారంతా ఆగ్రహిస్తున్నారు. పవన్ కల్యాణ్ విలువల్ని గాలికి వదిలేశారని, తాము జనసేన అని చెప్పుకోడానికి సిగ్గుపడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారని చెబుతున్నారు.
ఇప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తలు విషాదంతో పాట పాడుకోవడం ఒక్కటే మిగిలి వుంది. అదేంటంటే…
అనుకున్నామని జరగవు అన్నీ … అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని
నీ సుఖమే నేకోరుకున్నా
నిను వీడి అందుకే వెళ్తున్నా… అనే పాటను తమకు అన్వయించుకుని పాడుకోవాల్సిన పరిస్థితి.
పవన్‌కల్యాణ్ గురించి ఏవేవో ఊహించకున్నామని, ఏవీ జరగలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఆయనపై భ్రమలు తొలగినందుకు సంతోషంగా వుందని అంటున్నారు. పవన్‌కల్యాణ్ సీఎం కావాలని, ఆయన సుఖసంతోషాలు కోరుకున్నామని, కానీ ఆయన మాత్రం చంద్రబాబు రాజకీయ ఉన్నతి కోసం కలలు కన్నారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. పవన్‌కల్యాణ్ రాజకీయ ఉన్నతిని తాము కోరుకున్నా, ఆయన మాత్రం చంద్రబాబు కోసం తపిస్తుండడంతో, తాము ఆయన్ను విడిచి వెళ్తున్నామని జనసేన శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.