మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. ఆలస్యంగా అయినా అధికార పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న రాత్రి సుబ్రహ్మణ్యం హత్య జరిగిన విషయం తెలిసిందే. హత్యలో తన పాత్రను పోలీసుల ఎదుట అంగీకరించడంతో అధికార పార్టీ వేటు వేయడం గమనార్హం. రాజకీయాల్లో రౌడీలు, ఖూనీకోరులు, భూకబ్జాదారులు పెరిగిపోతున్నారు. ఇందుకు ఏ పార్టీ అతీతం కాదు.
తమ పార్టీ పరిశుద్ధమైందని ఎవరైనా చెబితే అంతకంటే పెద్ద జోక్ వుండదు. కనీసం నేరం చేశారని తెలిసినప్పుడైనా బయటికి పంపడాన్ని అభినందించాలి. సొంత పార్టీ నేతలపై వైసీపీలా చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం టీడీపీకి ఉందా? అంటే లేదనే సమాధానం వస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన నిందితుడు. కొల్లును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
హత్యకు పాల్పడిన మాజీ మంత్రిని పార్టీ నుంచి బయటకు పంపకపోగా, ఆయనకు టీడీపీ మద్దతుగా నిలిచింది. దీన్ని ఏమనాలి? అలాగే నంద్యాల టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ పాత్ర ఉందని కడప పోలీసులు చెప్పారు. భార్గవ్‌రామ్ పీఏను అరెస్ట్ చేశారు. ఈ కేసులో భార్యాభర్తలిద్దరూ బెయిల్ తెచ్చుకుని దర్జాగా తిరుగుతున్నారని అనేక సందర్భాల్లో ఏవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తె తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే హైదరాబాద్‌లో భూవివాదంలో ఏకంగా కిడ్నాప్‌నకు తెగబడి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రోజుల తరబడి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భాల్లో మాజీ మంత్రులపై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.
నేరాల విషయంలో టీడీపీకి ఏమైనా ప్రత్యేక మినహాయింపులున్నాయా? అని ప్రశ్నించే వాళ్లకు సమాధానం ఏంటి? పైగా ఇలాంటి వాళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తూ టీడీపీ ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటోంది? ఎదుటి వాళ్లపై వేలెత్తి చూపే ముందు, తామెంత వరకూ నీతిగా ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అనంతబాబు విషయంలో వైసీపీ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం మంచి పరిణామం.