టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు రాజకీయాలు చేయడానికి ఏదో ఒకటి కావాలి. ఇప్పుడాయనకు అన్న క్యాంటీన్ ఆయుధమైంది. కాదేదీ కవితకు అనర్హమన్నట్టు… రాజకీయానికి ఏదీ అనర్హం కాదనేది లోకేశ్ ఫిలాసఫీ. జగన్ ప్రభుత్వ ఉద్దేశం ఏంటో గానీ, టీడీపీ ట్రాప్‌లో పడ్డట్టుగా కనిపిస్తోంది. ఎన్నికలు వస్తున్నాయని టీడీపీ అన్న క్యాంటీన్లను స్టార్ట్ చేయాలని భావించింది. మహా అయితే 200 లేదా 300 మందికి అన్నం పెట్టి వుండేవాళ్లేమో.
దీన్ని అలా వదిలేసి వుంటే రాజకీయ ప్రచారం అంతంత మాత్రమే లభించేది. కానీ అడ్డుకోవడం వల్ల అనవసర నెగెటివ్ ప్రచా రానికి అవకాశం ఇచ్చినట్టైంది. తద్వారా పేదల ఆకలి తీర్చడం సంగతేమో గానీ, టీడీపీ రాజకీయ ఆకలిని జగన్ ప్రభుత్వం తీర్చుతున్నట్టైంది. ప్రభుత్వ అడ్డగింతపై లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తెనాలిలో అన్న క్యాంటీన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై లోకేశ్ సీరియస్‌గా స్పందించారు. ఆయన ఏమన్నారంటే…
అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరన్నారు. జగన్ రెడ్డి ఏం తింటున్నాడో ఆయనే తేల్చుకోవాలని లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అన్న క్యాంటీన్లకు అడ్డుపడ్డారన్నారు. ఇప్పుడు తెనాలిలో అడ్డుతగులు తున్నారని మండిపడ్డారు.
జగన్ రెడ్డిలో మానవత్వం అనేదే లేదా? అని లోకేశ్ ప్రశ్నించారు. లోకేశ్‌పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. చివరికి అన్నాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్న లోకేశ్… ఏం తింటున్నారో చెప్పాలని నిలదీస్తున్నారు. నిజంగా పేదలకు అన్నం పెట్టాలంటే ప్రచారం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.