‘అన్న’కే అన్నం పెట్టనోళ్లు… ఆయన పేరుతో లోకమంతటికీ అన్నం పెడతారట! ఈ మాటలు నమ్మాలని టీడీపీ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల గొడవ నడుస్తోంది. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీ వేదికగా తన మిత్రుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు విసిరిన పంచ్ గుర్తుకొస్తోంది.
‘అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట’ అని చంద్రబాబు పిసినారితనాన్ని వైఎస్సార్ ఏనాడో చెప్పారు. కుప్పంలోనూ, తాజాగా తెనాలిలో అన్న క్యాంటీన్ల వ్యవహారం వివాదాస్పదమైంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని తెనాలిలో అన్న క్యాంటీన్‌కు మున్సిపల్, పోలీస్ అధికారులు అనుమతి నిరాకరించారు. అయితే టీడీపీ నేతలు పంతానికి పోయి అన్నదానానికి సిద్ధమవడంతో పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.
ఎవరి పేరుతో అయితే అన్నదానం చేస్తామని టీడీపీ చెబుతున్నదో, ఆ మహానుభావుడు బతికున్న రోజుల్లో పిడికెడు అన్నం పెట్టే వాళ్లే కరువయ్యారు. ఎన్టీఆర్‌కు సంతానం చూద్దామంటే …. పెద్ద జాబితానే. కానీ ఏం లాభం? ఎంత మంది ఉన్నా వృద్ధాప్యంలో ఆయన ఆలనాపాలనా చూసే వాళ్లే కరువయ్యారు. అందుకే ఆ వయసులో లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ చేరువయ్యారు. ఎన్టీఆర్ యోగక్షేమాలను చూడడం వల్లే లక్ష్మీపార్వతిని అర్ధాంగి చేసుకున్నారు.
ఎన్టీఆర్‌కు అవసరమైన సమయంలో ప్రేమాభిమానాలు పంచి వుంటే, అలాగే సమయానికి ఆకలి తీర్చి వుంటే లక్ష్మిపార్వతి అవసరం ఎందుకొచ్చేదనే ప్రశ్నలు లేకపోలేదు. ఎన్టీఆర్ బతికినంత కాలం… ఆయన చావు కోసం ఎదురు చూసిన ప్రబుద్ధులంతా ఇప్పుడు ఆయనపై ప్రేమ ఒలకబోయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లు పెడుతుంటే జగన్ ప్రభుత్వం అడ్డుకుంటోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇది నిజమే అని కాసేపు అనుకుందాం.
టీడీపీ హయాంలో ఎందుకని అన్న క్యాంటీన్లను రాష్ట్రమంతా ఏర్పాటు చేయలేకపోయారో సమాధానం చెబుతారా? ఇక అధికారం నుంచి దిగిపోయే ఏడాది ముందు మొక్కుబడిగా అన్న క్యాంటీన్లు ప్రారంభించి… అది కూడా పరిమిత సంఖ్యలో, తక్కువ ధరకు భోజనం పెట్టడం వాస్తవం కాదా? ఇదేనా అన్నపై టీడీపీ గౌరవం? రాజకీయ ప్రయోజనాల కోసం తప్పితే, ఎన్టీఆర్‌ను వాత్సల్యంతో చంద్రబాబు, లోకేశ్ గుర్తు చేసుకున్నారా? అని ప్రశ్నించే వాళ్లకు సమాధానం ఏంటి?