వివేకా హత్య కేసులో వైసీపీ తప్పు చేస్తోంది. ఐదేళ్ల క్రితం జరిగిన హత్యకు సంబంధించి వైఎస్ కుటుంబ సభ్యుడు, వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాలని వివేకా కుమార్తె సునీత, షర్మిల, ప్రతిపక్ష పార్టీల నేతలు తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల.. కేవలం వివేకా హత్య కేసు కేంద్రంగా రానున్న రోజుల్లో రాజకీయం నడిపేందుకు వ్యూహం రచించుకున్నారు.
అందుకే రెండు రోజుల క్రితం తన ప్రత్యర్థి అవినాష్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వివేకాను చంపిన అవినాష్‌రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని ఆమె నిలదీశారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా మొదటి రోజు ప్రొద్దుటూరులో జరిగిన భారీ బహిరంగ సభలో మొదటిసారిగా సీఎం జగన్ తన చిన్నాన్న హత్యపై స్పందించారు. చంపినోళ్లకు, పైన దేవుడికి, జిల్లా ప్రజలందరికీ హత్య ఎవరు చేశారో తెలుసన్నారు. తన ఇద్దరు చెల్లెళ్లను ప్రత్యర్థులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉసిగొల్పుతున్నారని వాపోయారు.
జగన్ కామెంట్స్‌ను తీసుకుని సునీత, షర్మిల ఎదురు దాడికి దిగారు. అసలు తన చిన్నాన్న హత్య గురించి జగన్ మాట్లాడకుండా వుండాల్సిందనే అభిప్రాయం వైసీపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. వివేకా హత్య కేసులో దోషులెవరో న్యాయస్థానం తేలుస్తుందనే మాటతో జగన్ సరిపెట్టి వుంటే బాగుండేదని చాలా మంది అంటున్నారు. షర్మిలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. అసలు షర్మిలను వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా నైతికంగా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.
ప్రజాకోర్టులో అవినాష్‌రెడ్డి నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారన్నారు. ఒకవేళ అవినాష్‌ను ఓడిస్తే, ఆయన దోషిగా తాము అంగీకరిస్తామని, ఇందుకు షర్మిల సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. తాజాగా జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కూడా స్పందించారు. తన పక్కనే అవినాష్‌రెడ్డిని పెట్టుకుని, వివేకా హత్యపై ఆయన మాట్లాడారు.
ఎర్రగంగిరెడ్డే రక్తపు మరకలు తుడిచేశారని చెప్పుకొచ్చారు. వివేకా వెంట ఎప్పుడూ ఎర్రగంగిరెడ్డి వుండేవాడన్నారు. రక్తపు మరకలు తుడిచే సమయానికి అక్కడ అవినాష్‌రెడ్డి అమాయకంగా నిలబడడమే తప్పు అయ్యిందన్నారు. ఇంతకు మించి అవినాష్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. అవినాష్‌పై ఆరోపణలు చేస్తున్న వాళ్లందరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ పరోక్షంగా తన మేనకోడలు వైఎస్ షర్మిల గురించి కమలాపురం ఎమ్మెల్యే చేశారు.
ఎన్నికల సమయంలో వివేకా హత్య కేంద్రంగా రాజకీయాలు చేయాలని వైసీపీ ఎందుకు ఉత్సాహం చూపుతున్నదో అర్థం కావడం లేదని ఆ పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా షర్మిల, సునీతలకు అస్త్రం ఇచ్చినట్టు అవుతుందని వైసీపీ నాయకుల ఆవేదన. కడప జిల్లాకు జగన్ హయాంలో జరిగిన మంచి పనుల గురించి చర్చకు పెడితే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.