ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మరోసారి ఎన్నికల ఘట్టం మొదలైంది. వివిధ కారణాలతో ఎన్నికలు జరగని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిథిలో కొద్ది సేపటి కిందట పోలింగ్ మొదలైంది. అయితే వీటన్నింటిలో అందర్నీ ఆకర్షిస్తున్నసెగ్మెంట్ మాత్రం కుప్పం మున్సిపాలిటీ. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కనీసం ఈ మున్సిపాలిటీనైనా నిలబెట్టుకొని పరువు దక్కించుకోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. తను స్వయంగా రంగంలోకి దిగడంతో పాటు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
ఇలా రెండు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుప్పం మున్సిపాలిటీలో 24 వార్డులకు పోలింగ్ మొదలైంది. 24 వార్డులకు గాను 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 39261 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఏమైనా అవాంతరాల వల్ల పోలింగ్ కు ఆటంకం ఏర్పడితే.. 5 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు.
కుప్పంలో పట్టు నిలుపుకునేందుకు చంద్రబాబు ఎన్నో డ్రామాలు ఆడారు. తన మనుషుల్ని రంగంలోకి దించారు. ప్రచారంలో ఒంగి ఒంగి ప్రజలకు దండాలు పెట్టారు. లోకేష్ అయితే పలు వార్డుల్లో రోడ్ షోలు చేశారు. మరోవైపు టీడీపీ మనుషులు ఓటర్లకు డబ్బులు పంచిపెట్టారు. కొన్ని వార్డుల్లో ఓటుకు 10వేల రూపాయలు, కుటుంబంలో ఐదుగురు ఓటర్లు ఉంటే ఫ్రిడ్జ్, ఏసీ లాంటి సౌకర్యాలు కూడా అందించారు.
ఇలా ఏ మున్సిపాలిటీ ఎన్నికల్లో జరగని రీతిలో ధనప్రవాహం, ప్రలోభాల పర్వం నడిచింది. ఏపీ, తెలంగాణలో అత్యంత ఖరీదైన మున్సిపాలిటీ ఎన్నికలుగా ఇవి నిలిచిపోనున్నాయి. అటు వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నీ తానై ఈ ఎన్నికల్ని పర్యవేక్షిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని కుప్పంతో పాటు.. కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, కొండపల్లి, పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలో దర్శి, కర్నూలు జిల్లాలో బేతంచర్ల, కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం, అనంతపురం జిల్లాలో పెనుకొండ మున్సిపాలిటీల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది.
అటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అప్పగించారు చంద్రబాబు. కొన్ని రోజులుగా నెల్లూరులోనే తిష్టవేసిన అచ్చెన్నాయుడు.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద టాస్క్ ఇదే. అటు వైసీపీ నుంచి అనీల్ కుమార్ యాదవ్ ఈ ఎన్నికల బాధ్యతను తీసుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్ లో 54 డివిజన్లు ఉంటే, అందులో 8 డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవం అయింది. మిగిలిన డివిజన్లలో ఈరోజు పోలింగ్ మొదలైంది.
బుధవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టి, అదే రోజు ఫలితాల్ని వెల్లడిస్తారు. ఆ రోజు మధ్యాహ్నానికి కుప్పం సంగతి తేలిపోతుంది. దాదాపు అదే సమయానికి నెల్లూరు కార్పొరేషన్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.