టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించి, తొలి సారి ఈ ఫార్మాట్ లో ప్రపంచకప్ ను అందుకుంది. వన్డే వరల్డ్ కప్ లను ఇది వరకే ఐదు సార్లు నెగ్గిన ఆస్ట్రేలియా, టీ20 ఫార్మాట్ లో ప్రపంచకప్ కోసం మాత్రం సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వచ్చింది. 2007లో మొదలైన టీ20 ప్రపంచకప్ ను ఎట్టకేలకూ 2021లో ఆస్ట్రేలియా సాధించింది. వాస్తవానికి ఈ సారి హాట్ ఫేవరెట్ అనుకున్న జట్లలో కూడా ఆస్ట్రేలియా లేదు!
ప్రధానంగా ఇంగ్లండ్, ఇండియాలనే చాలా మంది హాట్ ఫేవరెట్స్ గా పరిగణించారు. వెస్టిండీస్, పాకిస్తాన్ లకు కూడా మంచి అవకాశాలున్నాయని అంచనా వేశారు. అయితే ఆ ఊహాగానాలు అన్నీ తలకిందలయ్యాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కూడా ఈ రెండు జట్లే పోటీ పడ్డాయి. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఈ సారి కూడా అదే జరిగింది.
ఈ మధ్యకాలంలో ఐసీసీ ఈవెంట్స్ లో ఫైనల్ కు చేరడం న్యూజిలాండ్ తరచూ చేయగలుగుతోంది. అయితే 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యింది. అయితే ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ లో మాత్రం ఫైనల్లో ఇండియాపై నెగ్గి, విజేతగా నిలిచింది. టీ20 ఫైనల్ కు వచ్చే సరికి మాత్రం మళ్లీ రన్నరప్ గా నిలిచింది.
ఈ విజయం గురించి ఎవరెలా ఆడారనే విశ్లేషణల కన్నా.. టాస్ తోనే సగం మ్యాచ్ ఫలితంపై క్లారిటీ వచ్చినట్టుగా ఉంది. టాస్ నెగ్గడంతోనే ఇంకో సెకను కూడా ఆలోచన లేకుండా ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది. దుబాయ్ వేదికగా ఈ ప్రపంచకప్ లో జరిగిన మ్యాచ్ లలో చేజింగ్ జట్లు అలవోకగా విజయాలు నమోదు చేశాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు పరుగులు చేయడానిక ఇబ్బంది పడటం, సెకెండ్ బ్యాటింగ్ జట్లు అలవోకగా ఆడేయడం జరగుతూ వచ్చింది. దీంతో ఏదో ఒక జట్టు టాస్ గెలవడంతోనే మ్యాచ్ అయిపోయిందనే భావన అభిమానులకు కూడా కలుగుతూ వచ్చింది.
అయితే న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ గట్టి పోటీనే ఇచ్చింది. ప్రత్యేకించి ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. ఆసీస్ బౌలర్లలో కొందరు క్రమశిక్షణతో వేశారు. ఒక్క స్టార్క్ మాత్రమే కట్టు తప్పాడు. స్టార్క్ ఫుల్ కోటా ఓవర్లలో ఏకంగా 60 పరుగులను పిండుకున్నారు కివీ బ్యాట్స్ మెన్. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి కివీస్ 172 పరుగుల గౌరవప్రదమైన టార్గెట్ నే నిర్దేశించింది. అయితే చేజింగ్ జట్టుకు మళ్లీ పరిస్థితులు అనుకూలించాయి.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను తక్కువ చేయడం కాదు కానీ.. చేజింగ్ మాత్రం ఆ జట్టుకు కలిసి వచ్చిందని చెప్పకతప్పదు. ఫైనల్ కూడా ప్రిడిక్టబుల్ కు తగ్గట్టుగానే సాగింది.