ఆంధ్రప్రదేశ్‌ను రామతీర్థం ఘటన షేక్ చేస్తోంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం కావడం రాజకీయ దుమారం రేపుతోంది.
నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
చర్యకు ప్రతిచర్య ఉండడం ప్రకృతి ధర్మం కదా! నిన్నటి బాబు విమర్శలకు ఆయన ప్రియమిత్రుడైన కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కొడాలి నాని రామతీర్థం దోషులెవరో తేలాలంటే ఏం చేయాలనే విషయమై సంచలన డిమాండ్ చేశారు.
రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్ని ధ్వంసం చేయించింది చంద్రబాబే అని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయని ఆయన సంచలన డిమాండ్ చేశారు.
దేవుడులాంటి ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదని ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసమే విజయనగరం జిల్లా రామతీర్థంలో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారని నాని విరుచుకుపడ్డారు.
దేవుళ్ళను అడ్డంపెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళను కూల్చి, చెత్త ట్రాక్టర్లలో దేవుళ్ళ విగ్రహాలను డంపింగ్ యార్డ్‌ల్లో పడేసిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఆధ్వర్యంలోని అతని అనుచరులు అధీనంలో ఉన్న గుళ్ళు, ఊరికి దూరంగా ఉన్న గుళ్ళలో దాడులు జరుగుతున్నాయని నాని విమర్శించారు. దేవుడంటే విశ్వాసం, నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
రామతీర్థం ఘటనపై విచారించి దోషులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. చంద్రబాబు దోషిగా తేలినా, లేదా ఆయన తండ్రి ఖర్జూర నాయుడు ఉన్నా, తాత కిస్మిస్ నాయుడు ఉన్నా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని చవట, దద్దమ్మ లోకేష్.. ముఖ్యమంత్రి జగన్‌కు ఛాలెంజ్ విసరడం విడ్డూరంగా ఉందని విరుచుకుపడ్డారు. మొత్తానికి తండ్రీకొడుకులను కొడాలి నాని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.