‘రాజధాని మార్పునకు మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం ఉందనుకుంటే …రెఫరెండం నిర్వహించండి. ఐదు కోట్ల మంది ప్రజలు ఏ తీర్పు ఇస్తే దానికి కట్టుబడి ఉంటాను. లేదనుకుంటే రాజధాని మార్పు ఎజెండాగా మళ్లీ ఎన్నికలకు రండి. ప్రజల్లోకి వెళ్దాం….వారే తీర్పు ఇస్తారు’ అని సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు.
చంద్రబాబు ఆలోచన ప్రకారం వెళ్దాం. రాజధాని మార్పునకు జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం లేదనుకుందాం. అలాంటప్పుడు ఐదుకోట్ల మంది ప్రజలు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబు బలంగా నమ్ముతున్నప్పుడు, తన పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలతో సామూహికంగా రాజీనామాలు ఎందుకు చేయించకూడదు? తనకు దూరంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టి చంద్రబాబు ఆలోచిస్తే ఎలా ఉంటుంది?
తాను కలలు కన్న అమరావతి కోసం, తనపై నమ్మకం, విశ్వాసంతో 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రాజధాని రైతుల కోసం చంద్రబాబు ఆ మాత్రం త్యాగం చేయలేరా? ఎటూ తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తిరిగి భారీ మెజార్టీలతో గెలుపొంది జగన్ సర్కార్ మెడలను వంచే గొప్ప అవకాశాలన్ని చంద్రబాబు ఎందుకు తీసుకోకూడదు?
గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేకమార్లు ఎంపీ పదవులకు రాజీనామా చేసిన చరిత్ర కళ్ల ముందు ప్రత్యక్ష ఉదాహరణగా ఉంది కదా! కేసీఆర్ స్ఫూర్తితో అమరావతి రైతుల త్యాగం వృథా కాకూడదని చంద్రబాబు నిజంగా లక్ష్యంగా పెట్టుకుంటే…ఎమ్మెల్యే పదవులు ఎంత? అలాగే విజయవాడ, గుంటూరు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి ఎటూ టీడీపీ నేతలే కదా ఎంపీలుగా ఉండేది. పనిలో పనిగా వారితోనూ రాజీనామా చేయిస్తే జగన్ సర్కార్ ఎందుకు దిగిరాదో చూద్దాం బాబూ.
ఎంతసేపూ గుంటూరు, విజయవాడ వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే జగన్ దిగి వస్తాడని లోకేశ్, చంద్రబాబు డిమాండ్ చేయడమేనా? తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలని లోకేశ్‌కు ఎందుకు ఆలోచన తట్టలేదో? అసలు టీడీపీ ప్రజాప్రతినిధుల రాజీనామాలను అధికార వైసీపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదో అర్థం కావడం లేదు. రాజధాని ఎజెండాగా టీడీపీనే ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడు తీర్పును ఐదు కోట్ల ప్రజాతీర్పుగా భావిస్తామని వైసీపీ ఎందుకు డిమాండ్ చేయలేకపోతోంది?