మనిషి అన్న తర్వాత కాస్త చలనం ఉండాలి. మంచీచెడూ అనే విచక్షణ ఉండాలి. తన మాటలకు కనీసం అంతరాత్మకైనా సమాధానం చెప్పుకునేలా ఉండాలి. తనకంటూ అంతరాత్మ ఉందనే స్పృహ ఉన్నోళ్లు …కాస్త ఆలోచించి మాట్లాడుతారు.
అలాంటివేవీ లేవని నమ్మే వాళ్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు అలాంటి మనుషులు కూడా ఉంటారా? అనే ప్రశ్న కూడా ఎవరికైనా రావచ్చు. అలాంటి ప్రశ్నలకు చంద్రబాబు ట్వీట్ చక్కని సమాధానం ఇస్తుంది.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వాన్ని విడిచి పెట్టి, ఏ మాత్రం సంబంధం లేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
తన ట్వీట్ చూసిన వారెవరైనా నవ్వుతారనే స్పృహ కూడా లేని తనాన్ని ఎలా అభివర్ణించాలో కూడా తెలియని స్థితి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తే ఉద్యమిస్తామనే చంద్రబాబు హెచ్చరికలోని డొల్లతనం ఏంటో ఆయన ట్వీటే ప్రతిబింబిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు అని, దాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తే ఉద్యమం తప్పదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. లక్షలాది మంది ఏళ్ల తరబడి ఉద్యమించి, 32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కును సాధించుకున్నారని ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తుక్కు కింద కొనేసి, రూ.లక్షల కోట్లు కొట్టేదామనుకుంటున్న జగన్‌రెడ్డి గ్యాంగ్ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకుంటామని చంద్రబాబు స్పష్టం చేయడం గమనార్హం.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వమైతే, దాన్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేని చంద్రబాబు తన నైజాన్ని మరోసారి నిస్సిగ్గుగా ప్రదర్శించారు.
‘అభివృద్ధి వికేంద్రీకరణకే విశాఖలో పరిపాలనా రాజధాని అన్న జగన్.. ఇప్పటికే ఆ పేరుతో విశాఖలో కొండలు, గుట్టలు మింగేశారు. భూములు ఆక్రమించారు. ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా?. ప్రత్యక్షంగా 18వేల మంది శాశ్వత ఉద్యోగులు, 22వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తుంటే ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి? నీపై ఉన్న 31 కేసుల మాఫీ కోసం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టేశావు’ అని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ఇంతటితో ఆయన ఆగలేదు.
పనిలో పనిగా తన గొప్పతనాన్ని చెప్పుకున్నారు.
‘గతంలో వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో ఇదే పరిస్థితి వస్తే… కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడింది అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. ఆ పని ఇప్పుడు మీరెందుకు చేయరు? ఢిల్లీని ఢీ కొడతా, మోదీ మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికే జగన్‌రెడ్డీ… నీ క్విడ్ ప్రోకో దోపిడీ బుద్ధిని పక్కనపెట్టు. తెలుగు వారి ఉద్యమఫలం, విశాఖ మణిహారం ఉక్కు కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీపై ఉందని గుర్తుంచుకో’ అని చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవాలంటే అధికారంలో ఉండాల్సిన పనిలేదు. తెలుగువాళ్ల ఆత్మగౌరవం పేరుతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ అధినేతగా, ఏపీ ప్రతిపక్ష నేతగా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించిన మోడీ సర్కార్‌పై కనీసం మాట మాత్రం కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంత సేపూ జగన్‌ను తిట్టిపోయడం తప్ప, మరో పనే లేనట్టు చంద్రబాబు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేయాలని జగన్ కోరుకుంటారంటే ఎవరైనా నమ్ముతారా?
విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రైవేట్ పరం కావడానికి జగనే కారణమనే తన విమర్శలను జనం నమ్ముతారని చంద్రబాబు కలలు కంటున్నారా? ఎందుకీ హూందాతనం లేని విమర్శలు? ప‌్రతి దానికి జగన్‌కు ముడిపెడితే, నిజంగా ఆయనకు సంబంధం ఉన్న విషయాలను కూడా నమ్మలేని పరిస్థితిని తన లాజిక్ లేని ట్వీట్లు తీసుకొస్తున్నాయని చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా? చంద్రబాబు వాలకం చూస్తుంటే …అబ్బే తమకు సిగ్గు ఎగ్గు అనేవి అసలే లేవని చాటుకుంటున్నట్టుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.