విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం చేసే ప్రతిపాదనన్ తెలుగు సినిమా రంగానికి చెందిన వారంతా ముక్తకంఠంతో తిప్పికొడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, అటువంటి బంగారు లాంటి పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడమేంటని కూడా మండిపడుతున్నారు.
మొదటిగా ఈ విషయంలో ప్రజా నటుడు ఆర్ నారాయణమూర్తి గళం విప్పితే మెగాస్టార్ చిరంజీవి ఉక్కు ప్రైవేటీకరణ పట్ల నిరసన వ్యక్తం చేశారు. అదే వరసలో ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పట్నాయక్ కూడా ఉక్కు ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
ఇక మాటల రచయిత కోన వెంకట్ అయితే ఉక్కుని మనమే దక్కించుకుందామని అంటున్నారు. ఉక్కు పరిశ్రమ విషయంలో పాటల రచయితలు, ఇంతర సాంకేతిక విభాగానికి చెందిన వారు సైతం ప్రైవేట్ వద్దు అంటు గట్టిగానే మాట్లాడుతున్నారు.
ఈ మధ్యన విశాఖ వచ్చిన హీరో మంచు విష్ణు సైతం విశాఖ ఉక్కుని కాపాడుకుందామని పిలుపు ఇచ్చారు. మొత్తం మీద చూస్తే సినీ జనం మద్దతు బాగానే ఉక్కు పోరాటానికి దక్కుతోంది.
ఇన్నాళ్ళూ ప్రజా సమస్యల విషయంలో పట్టకుండా ఉంటారు అన్న అపవాదుకు గురి అయినా సినీ లోకం ఉక్కు ప్రైవేటీకరణ పట్ల మాత్రం బాగానే స్పందిస్తోంది. మరి ఈ మద్దతు మాటలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష పోరాటానికి కూడా సినీ రంగం పెద్దలు దిగాలని ఉక్కు కార్మిక సంఘాలు కోరుతున్నాయి.