విశాఖ పాలనా రాజధానిగా ప్రకటించాక దాని రాజసమే వేరే లెవెల్ కి చేరింది. విశాఖ ఇప్పటికే ఎటూ మెగా సిటీ. ఏపీలో ఉన్న ఏకైక మహా నగరం. పైగా రోడ్, రైల్, ఎయిర్, సీ కనెక్టివిటీ కలిగిన సిటీగా ఉంది.
విశాఖను సౌత్ లోనే నంబర్ వన్ గా చేయడానికి జగన్ సర్కార్ సమగ్రమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. విశాఖను సినీ రాజధానిగా చేయడం అందులో భాగమే.
ఈ నేపధ్యంలో విశాఖలో అద్భుతమైన సినీ స్టూడియోను ప్రభుత్వమే నిర్మించాలన్నది ఒక ప్రతిపాదనగా ఉందిట. అదే జరిగితే సినిమా రంగానికి సంబంధించిన పూర్తి యాక్టివిటీ విశాఖలోనే సాగుతుంది అంటున్నారు.
సినీ రంగానికి చెందిన ప్రముఖులకు మూడు దశాబ్దాల క్రితం నాటి ప్రభుత్వాలు స్టూడియో నిర్మాణానికి పెద్ద ఎత్తున భూములు ఇచ్చాయి. అయినా ఒక్క రామానాయుడు స్టూడియో తప్ప మిగిలిన వారు ఎవరూ ఇక్కడ నిర్మాణాలు చేపట్టలేదు.
ఈ నేపధ్యంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని స్టూడియోను నిర్మిస్తే ఏపీకి చెందిన సినీ కళాకారులను ప్రోత్సహించినట్లుగా ఉంటుందని ఆలోచిస్తోందని అంటున్నారు.
అదే విధంగా విశాఖలో సినీ రాజధాని అభివృద్ధికి ఆసక్తి ఉన్న పెద్దలను కూడా కలుపుకుని పోవాలని కూడా యోచిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి బహుముఖీయంగా విశాఖ ప్రగతి కోసం ప్రణాళికలను ప్రభుత్వం రెడీ చేసి పెడుతోంది అంటున్నారు.