రాజ‌కీయ పార్టీల‌ను అంట‌రానివిగా భావించొద్దు!

త‌మ ఉద్య‌మంలోకి రాజ‌కీయ పార్టీల‌ను అనుమ‌తించేది లేద‌ని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్ప‌డం… కొంద‌రికి మింగుడు ప‌డ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ ఆవేద‌న‌ను, ఆలోచ‌న‌ల‌ను మీడియాతో పంచుకోడానికి ముందుండే సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి…

త‌మ ఉద్య‌మంలోకి రాజ‌కీయ పార్టీల‌ను అనుమ‌తించేది లేద‌ని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్ప‌డం… కొంద‌రికి మింగుడు ప‌డ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ ఆవేద‌న‌ను, ఆలోచ‌న‌ల‌ను మీడియాతో పంచుకోడానికి ముందుండే సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ‌ మ‌రోసారి ఆ ప‌ని చేశారు. 

రాజ‌కీయ పార్టీల‌ను అంట‌రానివిగా భావించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. అంటే ఉద్యోగుల ఉద్య‌మంలోకి త‌మ‌తో పాటు ముఖ్యంగా టీడీపీని అనుమ‌తించాల‌నేది ఆయ‌న మాట‌ల అంత‌రార్థం.

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్యోగులు చేప‌ట్ట‌నున్న ఉద్య‌మాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి రాజ‌కీయంగా లాభించేలా చేయాల‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. ఉద్యోగుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లికే పేరుతో ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచ‌ర‌ణ‌ను అభినందిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

రాజ‌కీయ పార్టీల‌కు ఉద్యోగ సంఘాలు అంట‌కాగాల్సిన ప‌నిలేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అలాగే రాజ‌కీయ పార్టీల‌ను అంట‌రాని త‌నంగా భావించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలిపారు. 

త‌మ‌ను ఎవ‌రు స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారో ఉద్యోగులు ఆలోచించుకోవాల‌ని కోరారు. తెగే వర‌కూ లాగ‌కుండా ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.