గుడివాడలో మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్లో సంక్రాంతిని పురస్కరించుకుని క్యాసినో నిర్వహించారనే వివాదం నడుస్తూనే ఉంది. అసలే మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ కావడంతో ఎల్లో బ్యాచ్ పండుగ చేసుకున్నాయి. దీనికి తోడు ఆయన కరోనాబారిన పడి హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటుండంతో స్పందించలేకపోయారు. నాని ఊళ్లో లేనిది చూసుకుని సహజంగానే ఎల్లో ముఠా రెచ్చిపోయింది.
కొడాలి నాని రాకతో క్యాసినో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నానిని రెచ్చగొట్టేందుకు అన్నట్టు టీడీపీ శుక్రవారం నిజనిర్ధారణ కమిటీ పేరుతో గుడివాడ వెళ్లారు. టీడీపీ ఎత్తుకు నాని పైఎత్తు వేశాడు. దీంతో టీడీపీ వ్యూహాలు గుడివాడలో పారలేదు.
చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా దెబ్బలతో సరిపెట్టుకుని …బతుకు జీవుడా అనుకుంటూ విజయవాడ చేరుకున్నారు. అయితే నిజ నిర్ధారణ కమిటీలో అసలు నాయకులు కాకుండా… రాజకీయంగా లబ్ధి పొందేందుకు అణగారిన వర్గానికి చెందిన నేతలను పంపడాన్ని కొడాలి నాని ప్రత్యేక గుర్తు చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో నిన్నటి కొడాలి ఊచకోతపై ఇవాళ టీడీపీ సీనియర్ నేత, నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు బొండా ఉమా స్పందిం చారు. ఏ తప్పు చేయకుంటే నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొడాలి నాని సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. క్యాసినో జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. క్యాసినో జరగలేదంటే పెట్రోల్ పోసుకునేందుకు తాను సిద్ధమని బొండా ప్రకటించారు. రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తే చాలని ఆయన అన్నారు.
విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్లో పీకల్లోతు కూరుకుపోయి, ప్రజల తిరస్కరణకు గురైన బొండా ఉమా నిజనిర్ధారణకు రావడం ఏంటని నాని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుకు చేతనైతే తన కన్వెన్షన్ సెంటర్ వద్దకు రావాలని నాని సవాల్ విసరడం తెలిసిందే.
చంద్రబాబు, లోకేశ్ తప్ప మరెవరినీ లెక్క పెట్టే స్థితిలో నాని లేరు. కానీ వాళ్లు తప్ప మిగిలిన వాళ్లు స్పందిస్తుండడం విశేషం. సైకిల్ గుర్తు కోసం చంద్రబాబు నీచానికి దిగజారారని, అలాగే అమ్మాయిలతో లోకేశ్ సరసాలపై నాని విమర్శలకు మాత్రం టీడీపీ నేతలు జవాబు చెప్పకపోవడం విడ్డూరం. వాటిపై మౌనం పాటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.