Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఎపి స్టోరీ రిపీట్..?

ఎపి స్టోరీ రిపీట్..?

తెలంగాణలో ఏం జరగబోతోంది. కేసిఆర్ కు మోడీకి మధ్య బంధం తెగి పోయినట్లేనా? ఆంధ్రలో 2018లో ఏం జరిగిందో, తెలంగాణలో అదే జరగబోతోందా? మోడీ తో తెగతెంపులు చేసుకున్నందున చంద్రబాబు పడిన ఇబ్బందులు అన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా పడబోతున్నారా? కేసిఆర్ అత్యంత సన్నిహితుడు మై హోమ్ రామేశ్వరావు పై ఆదాయపన్ను శాఖ దాడులను ఏ కోణంలో చూడాలి?

2024లో తెలంగాణలో అధికారసాధన లక్ష్యంగా భాజపా పావులు కదుపుతోంది. గత కొద్ది కాలంగా ఈ దిశగా వ్యవహారాలు లోపాయకారీగా నడుస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ప్రధాని మోడీకి మధ్య సంబందాలు క్రమక్రమంగా క్షీణిస్తున్నాయి. కేసిఆర్ కు ఢిల్లీలో ప్రధాని అపాయింట్ మెంట్ దొరకడం లేదు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించలేదు. దాదాపు ఆరేడు నెలల కాలంగా తెలంగాణలో భాజపా-తెరాస హానీమూన్ ముగిసిందన్న వార్తలు వినిపిస్తూనే వున్నాయి.

ఎన్నికలకు ముందు కేసిఆర్ తృతీయఫ్రంట్ అంటూ దేశంలో వివిధ పార్టీల నాయకులను కలిసినపుడు, ఇదంతా ఆయన మోడీ కోసం చేస్తున్నారని, యుపిఎ ను బలహీనం చేయడానికే ఇదంతా అని వదంతులు వినిపించాయి. అయితే అదే సమయంలో కొన్ని అనుమానాలు కూడా వినిపించాయి. 

ఎన్నికల అనంతరం భాజపాకు తెరాసకు మధ్య వైనం ముదురుతూ వస్తోంది తప్ప, తగ్గడం లేదు. టీవీ 9 కేసులో రవిప్రకాష్ కు ఏదో విధంగా కాస్త ఊరట లభించడం కూడా తెరాసతో కేంద్రం బంధాలు వీక్ కావడానికి సంకేతాలని ఆ మధ్య వినిపించింది. తెరాస మద్దతు దారులకు సంబంధం వున్న ఎన్టీవీలో వాటాలను భాజపా ఎంపీ ఒకరు కోనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు కూడా భాజపా ప్రయత్నాలను ఎత్తి చూపించాయి.

ఇలాంటి నేపథ్యంలో కేసిఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ ఆర్థిక మూలాలకు బలమైన కారకుడు అయిన మై హోమ్ రామేశ్వరరావు పై ఆదాయపన్ను దాడులు జరగడం కాస్త ఆలోచించదగ్గ విషయంగా మారింది. కేసిఆర్ మొండితనానికి పర్యాయపదంగా మారారు. ఎన్నికల టైమ్ లో ఆయన ఎంత మాట్లాడతారో? ఎన్నికలు ముగిసిపోయాక అంత మౌనం వహిస్తారు. మొండివాడు రాజుకన్నా బలవంతుడు అనే టైపు ఆయనది. ప్రపంచం ఏకం అయిపోయినా, ఆయన స్పందించరు.

ఇటీవల అటవీశాఖ అధికారిపై దాడి జరిగినా, ఆయన నేరుగా స్పందించింది లేదు. ముఖ్యమంత్రి ఆగ్రహించినట్లు బోగట్టా అని వార్తలు రాసుకోవడం తప్ప, అసలు సంగతి తెలియదు. అదే కాదు, రాను రాను కేసిఆర్ వైఖరి మరీ మొండిగామారుతోందని, ప్రజల్లో ఆ వైఖరి పట్ల కాస్త అసంతృప్తి, నిరసన వ్యక్తం అవుతున్నాయని రాజకీయ వర్గాలు పసిగట్టాయి. ఎంపీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష భాజపాకు కాస్త ఊపిరి ఊదాయి.

కాస్త కష్టపడితే తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదని ఆ పార్టీ భావిస్తోంది. ఆంధ్రలో కమ్మవారిని, తెలంగాణలో రెడ్లను చేరదీసి, రాజకీయం చేయాలనే ఎత్తుగడ భాజపా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీల ఆర్థికమూలాలను కనిపెట్టి, అక్కడ లాక్ చేయడం అన్నది భాజగా గతంలో ఆంధ్రలో ఎన్నికల ముందు అమలు చేసిన వ్యూహం. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే వ్యూహానికి తెరతీసినట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. కేంద్రం సహకరించకుండా పథకాల అమలు సాధ్యం కాదు. ఇప్పుడు కేంద్రంతో దోస్తానా లేకుంటే కేసిఆర్ గట్టెక్కడం కష్టం. పైగా జమిలి ఎన్నికలు అంటే 2022లోనే వచ్చే అవకాశం వుంది. అంటే గట్టిగా మూడేళ్లు మాత్రమే వుంది. అప్పటికి తెరాసపై ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింత పెరిగే అవకాశం వుంది. 

ఇటు ఆర్థిక మూలాలను కట్టడి చేయడం, అటు ఆర్థిక సహాయం కేంద్రం నుంచి అందకుండా చేయడం, ఆ తరువాత ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా విమర్శలు ఉధృతం చేయడం అన్నది గతంలో ఆంధ్రలో అమలు చేసిన వ్యూహం. ఆ వ్యూహం అమలు కారణంగానే జగన్ గెలిచి సిఎమ్ కావడానికి మార్గం సుగమం అయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే వ్యూహానికి పదును పెట్టినట్లు కనిపిస్తోంది.

ఇదే నిజమైతే, కేసిఆర్ మొండితనం వీడి, చంద్రబాబు మాదిరిగా పంతానికి పోకుండా మోడీతో రాజీకి వెళ్లడం ఉత్తమం. లేదూ అంటే ఏం జరుగుతుంది అన్నది చెప్పనక్కరలేదు. ఇప్పటికే ఆంధ్రలో రుజువు చేసారు మోడీ అండ్ కో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?