కేసీఆర్ చేయలేకపోయారు..జగన్ పూర్తిచేస్తున్నారు

అధికారంపై కానీ, ఆమ్యామ్యాలపై గానీ రెవెన్యూ ఉద్యోగులకు మంచి పట్టు ఉంటుంది. గ్రామస్థాయిలో వీఆర్వోల నుంచి, జిల్లా స్థాయిలో డీఆర్వో వరకు వారిదే హవా. రెవెన్యూ ఉద్యోగులు సహకరిస్తేనే పాలన సక్రమంగా సాగుతుంది, వారు…

అధికారంపై కానీ, ఆమ్యామ్యాలపై గానీ రెవెన్యూ ఉద్యోగులకు మంచి పట్టు ఉంటుంది. గ్రామస్థాయిలో వీఆర్వోల నుంచి, జిల్లా స్థాయిలో డీఆర్వో వరకు వారిదే హవా. రెవెన్యూ ఉద్యోగులు సహకరిస్తేనే పాలన సక్రమంగా సాగుతుంది, వారు మొండికేస్తే ఏ పథకమూ సక్రమంగా అమలయ్యే ప్రసక్తేలేదు. అవినీతి ఆరోపణలు కూడా రెవెన్యూ వ్యవస్థపైనే ఎక్కువగా వస్తుంటాయి. పట్టాలు, పాస్ పుస్తకాల విషయంలో వారు చెప్పిందే వేదం, గీసిందే గీత.

దీన్ని కాస్త నివారించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేసి భంగపడ్డారు. రెవెన్యూ ఉద్యోగులను వివిధ విభాగాల్లో కలిపేసి, వారి విధుల్ని మిగతా వారికి పంచేసి.. అవినీతిని ప్రక్షాళన చేస్తానంటూ ముందుకు కదిలినా ఏదీ జరగలేదు. అలా ముక్కుసూటిగా వెళ్లాలంటే కష్టమే, కానీ జగన్ మాత్రం చాలా తెలివిగా రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన మొదలుపెట్టారు. గ్రామ సచివాలయంతో వారి అధికారాలకు కత్తెర వేస్తూ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్నారు.

నిరుద్యోగ సమస్య నిర్మూలించడం, పథకాలను ప్రతి ఒక్కరి దగ్గరకు తీసుకెళ్లడం అనే ప్రయోజనాలు బైటకు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం రెవెన్యూ వ్యవస్థ నియంతృత్వాన్ని నియంత్రించడానికే గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ వచ్చిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పడతాయి. రాష్ట్రంలో మొత్తం 9500 గ్రామ సచివాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటిలో 12 శాఖలకు సంబంధించి సేవలు అందించేందుకు 10మంది ఉద్యోగులు ఉంటారు.

వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఎంపీఈవో, లైన్ మెన్.. ఇలా అప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారే కాకుండా కొత్తగా డిజిటల్ సహాయకులు, గ్రామీణ ఇంజినీరు.. వంటి పోస్టులు భర్తీ కాబోతున్నాయి. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఇప్పటివరకూ పవర్ సెంటర్లుగా ఉన్న తహశీల్దార్ కార్యాలయాల హవా తగ్గుతుంది. కేవలం రెవెన్యూ శాఖతోనే కాకుండా.. ఇతర శాఖల ఉద్యోగులతో కలసి వీఆర్వోలు పనిచేయాల్సి ఉంటుంది.

వీఆర్వోలు, పీఎస్ లు.. మొత్తం 10మంది ఉద్యోగులపై కొత్త అధికారిని నియమిస్తారు. దీంతో రెవెన్యూ వ్యవస్థ కూడా మిగతా విభాగాలతో కలసిపోతుంది, జవాబుదారీతనం పెరిగే అవకాశం ఉంది. అటు గ్రామ వాలంటీర్ వ్యవస్థతో రెవెన్యూ ఉద్యోగులపై పనిభారం తగ్గుతుంది. అదే సమయంలో ప్రజల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నట్టు.. వాలంటీర్లను ఆఫీస్ ల చుట్టూ తిప్పుకోలేరు కాబట్టి పనులు కూడా త్వరగానే పూర్తవుతాయి. ఇన్నాళ్లూ రేషన్ డీలర్ల దగ్గర కమీషన్లు పిండుకున్న సివిల్ సప్లయ్ అధికారులకు కూడా కళ్లెం పడుతుంది.

ఇలా గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ వ్యవస్థతో దాదాపుగా రెవెన్యూ ఉద్యోగుల ఆధిపత్యానికి, అవినీతికి ఎక్కడికక్కడ బ్రేకులు వేసుకుంటూ రాబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. తెలంగాణలో కేసీఆర్ చేయలేని పనిని, జగన్ తెలివిగా ఏపీలో అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ వ్యవస్థ.. దేశానికే మార్గదర్శకం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

బీజేపీలోకి చేరాలనే ఉంది కానీ, క్యాడర్ రాదే!