ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి నదీ ప్రాంతంలో నిర్మించిన అక్రమకట్టడం ప్రజావేదికను కూల్చివేయడానికి ఆదేశించిన వెంటనే.. తెలుగుదేశం నాయకులకంటె ఎక్కువగా పవన్ కల్యాణ్ కు ఆగ్రహం ముంచుకొచ్చింది. అదొక్కటీ కాదు.. అన్ని నిర్మాణాలను కూల్చేయాలి.. అంటూ ఆయన జగన్ కు సవాళ్లు విసిరారు. తద్వారా… ఏదో ఈ ఒక్క నిర్మాణాన్ని కక్షపూరితంగా కూల్చేస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి పవన్ ప్రయత్నించారు.
తాజా పరిస్థితుల్ని గమనిస్తున్నప్పుడు.. నదీ ప్రాంతాన్ని ఆక్రమించుకుని.. అక్రమంగా, అరాచకంగా.. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిన అన్ని నిర్మాణాలకు కూల్చివేత ముప్పు పొంచి ఉన్నట్లుగా కనిపిస్తోంది. అన్ని భవనాల మీద జగన్ సర్కార్ సమానమైన సీరియస్ నెస్ తో వ్యవహరించేలా కనిపిస్తోంది. పవన్ సవాలు చేశారని కాదు గానీ.. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలపై ముందడుగు వేస్తోంది. అందుకే.. అన్ని అక్రమ కట్టడాల్ని కూల్చేస్తే గనుక.. జగన్ సర్కారుకు పవన్ కల్యాణ్ జై కొడతారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి అక్రమ కట్టడాల్ని కూల్చివేయడం అంటూ జరిగితే… చంద్రబాబునాయుడు ప్రస్తుతం అద్దెకుంటున్న భవంతి కూడా నేలమట్టం అవుతుంది. దాని యజమాని లింగమనేనికి అత్యంత ఆప్తుడు అయిన పవన్ కల్యాణ్ కు దు:ఖం తప్పదు. లింగమనేని నుంచి తన సొంత ఇంటికోసం కారుచౌకగా భూముల్ని ఖరీదు చేసినట్లు విమర్శలు ఎదుర్కొనే పవన్ కల్యాణ్ ఇతరత్రా అనేక రూపాల్లో ఆయన ద్వారా లబ్దిపొందుతుంటారని వినికిడి.
అలాంటి నేపథ్యంలో కూల్చివేతలవల్ల లింగమనేని పొంగివచ్చే దు:ఖాన్ని పవన్ పంచుకోవాల్సిందే. ఆ ఆక్రోశంలోనే ఆయన సవాళ్లు విసిరారు. తీరా ఇప్పుడు అంతపనీ జరిగేలాగా ఉంది. 60 అక్రమ కట్టడాలకు నోటీసులు ఇచ్చినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అదే జరిగితే.. పవన్ కల్యాణ్… సవాలు చేసిన పాపానికి జగన్ కు జై అనడానికి సిద్ధపడాల్సిందే.