ఇంకా ఎవర్ని మోసం చేయాలి పవన్..?

పవన్ కల్యాణ్ కి గన్నవరంలో లభించిన స్వాగతం చూస్తుంటే.. కాస్త ఆశ్చర్యం కలగక మానదు. సినిమా హీరోగా పవన్ కల్యాణ్ ని చూడ్డానికి వస్తున్నారో లేక.. రాజకీయ నేతగా తమ భవష్యత్ మార్చే గొప్ప…

పవన్ కల్యాణ్ కి గన్నవరంలో లభించిన స్వాగతం చూస్తుంటే.. కాస్త ఆశ్చర్యం కలగక మానదు. సినిమా హీరోగా పవన్ కల్యాణ్ ని చూడ్డానికి వస్తున్నారో లేక.. రాజకీయ నేతగా తమ భవష్యత్ మార్చే గొప్ప నాయకుడని ఊహించుకుని వస్తున్నారో తెలియదు కానీ, పవన్ కనపడితే చాలు, జనాలు మాత్రం బాగానే గుమిగూడుతున్నారు. ఈ జనాన్ని చూసే పవన్ కల్యాణ్ తనని తాను ఎక్కువ అంచనా వేసుకని బొక్కబోర్లా పడ్డారు, అది వేరే సంగతి. 

అయితే ఇంత జరిగినా పవన్ కల్యాణ్ ఇంకా రివ్యూ మీటింగ్ లు, భవిష్యత్ కార్యాచరణ అంటూ సమావేశాలు పెట్టడం మాత్రం హాస్యాస్పదంగా ఉంది. అసలు పార్టీ పరిస్థితి ఏంటి, ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అనేది ఈపాటికే పవన్ కి అర్థమై ఉంటుంది. దీనికి సంబంధించి రివ్యూలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు మరోసారి కమిటీలు, సమీక్షలు అంటూ మభ్యపెట్టే కార్యక్రమం షురూ చేశారు పవన్. 

పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే ఇంకా చాలామందిని భ్రమల్లోకి లాగేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. స్వచ్ఛ రాజకీయాలు, పాతికేళ్ల ప్రస్థానం అంటూ ఇప్పటికే చాలామంది యువతని పక్కదారి పట్టించిన పవన్.. ఇంకా ఎవర్ని మోసం చేయడానికి ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారో అర్థం కావడంలేదు. ఈ సమీక్షలు, సమావేశాలు, స్థానిక పోరుకి పిలుపులు.. తనని తాను మోసం చేసుకుంటూ, తన చుట్టూ ఉన్నవారిని కూడా మభ్యపెట్టడం కోసమే అనుకోవాలి.

ఓవైపు పవన్ సినిమాల్లోకి వెళ్తాడంటూ ప్రచారం సాగుతోంది. నేరుగా ముఖానికి రంగేసుకోకపోయినా మెగా కాంపౌండ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. వీటిపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా ఇలా సమీక్షలు, కమిటీలు అంటూ ఎంత హంగామా చేసిన ప్రయోజనం ఉండదు. ముందు ఈ విషయంపై పవన్ క్లారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత రాజకీయంగా ఏం చేసినా అది చెల్లుబాటు అవుతుంది. 

జనసేన పార్టీ కోసం చాలామంది తమ ఉద్యోగాలు మానేసి, వృత్తి వ్యాపారాల్ని వదిలేసి వచ్చారు. అలాంటి వారంతా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఫలితాలు తేడా కొట్టినా కూడా వీరిలో చాలామంది ఇంకా ఏదో ఆశతోనే ఉన్నారు. పవన్ పై వాళ్లకు ఇంకా నమ్మకం తగ్గలేదు. ఆ మిగిలిన కొద్దిపాటి నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకోవాలి. క్షేత్రస్థాయిలో మీటింగ్స్ జరగాలి. అంతేతప్ప, ఇలా కమిటీలు వేస్తే ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని జనసేనాని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. లేదంటే మిగిలిన ఆ కొద్దిపాటి నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కూడా పవన్ కు అట్టే సమయం పట్టదు.

బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు