పదవులే కాదు.. బుజ్జగింపులు కూడా అదే రోజు!

వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈసారి తమకు కచ్చితంగా మంత్రిపదవి వస్తుందని అందులో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. పదవులపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ.. మరోసారి వైసీపీఎల్పీ సమావేశం…

వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈసారి తమకు కచ్చితంగా మంత్రిపదవి వస్తుందని అందులో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. పదవులపై ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ.. మరోసారి వైసీపీఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు జగన్. అంటే దానర్థం.. ఆ సమావేశంలో ఎవరు మంత్రులు అనే అంశంపై పూర్తి స్పష్టత వస్తుందన్నమాట.

ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండోసారి వైసీసీఎల్పీ సమావేశం జరగనుంది. మొదటిసారి జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి జగన్ ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అది లాంఛనం. కానీ ఈసారి జరగబోయే సమావేశం మాత్రం చాలా కీలకం.

కేబినెట్ లో ఎవరికి చోటు దక్కబోతోందనే అంశంపై ఈ సమావేశంలో పూర్తి స్పష్టత రాబోతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారంటూ బయటకు చెబుతున్నప్పటికీ, మంత్రి పదవులు ఎవరికి ఇస్తున్నారనే అంశంపైనే ఎక్కువ చర్చ ఉండబోతోంది. మంత్రి పదవులపై ఇప్పటికే జాబితా సిద్ధంచేసుకున్న జగన్, ఆ లిస్ట్ ను ఆరోజు సమావేశంలో చదివి వినిపించబోతున్నారు.

మంత్రి పదవులు దక్కించుకున్న వాళ్లకు ఎందుకు ఆ పదవి వరించిందో కూడా వివరించి చెప్పబోతున్నారు అధినేత. అదే సమయంలో పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలను కూడా బుజ్జగిస్తారు జగన్. వాళ్లకు ఎందుకు పదవులు దక్కలేదో కూడా సహేతుక కారణాలు వెల్లడిస్తారు. ఇలా ఓ సహృద్భావ వాతావరణంలో మంత్రి పదవుల్ని ప్రకటించాలని జగన్ నిర్ణయించారు. మంత్రి పదవులు దక్కించుకున్న నేతలంతా, మరుసటి రోజు అంటే 8వ తేదీన ప్రమాణ స్వీకారాలు చేస్తారు.

7వ తేదీ వరకు సమయం ఉన్నప్పటికీ, మంత్రిపదవులకు సంబంధించి నిన్ననే (ఆదివారం) తుది కసరత్తు పూర్తిచేశారు జగన్. శాఖలవారీగా జరుపుతున్న రివ్యూ మీటింగ్స్ ను పక్కనపెట్టి మరీ నిన్నంతా మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేసి తుది జాబితా సిద్ధంచేశారు. ఎవ్వరూ నిరుత్సాహానికి గురవ్వకుండా, అసమ్మతి రేగకుండా చాలా బ్యాలెన్స్ డ్ గా మంత్రివర్గాన్ని విస్తరించినట్టు తెలుస్తోంది. 

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు