సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీలు తమ మంత్రులెవ్వరో, కీలక పదవులు ఎవరికి దక్కబోతున్నాయో ముందే నిర్ణయించేసుకుని ఉంటాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉండే పార్టీ అధినేతలు నిజానికి ఎన్నికలకు ముందుగానే… తమ టీమ్ మంత్రుల విషయంలో డిసైడ్ అయిపోయి ఉంటారు. కానీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ ఈ ఎంపిక విషయంలో తన నిర్ణయాలను ప్రకటించే ముందు సహచర ఎమ్మెల్యేలు అందరి అభిప్రాయాలను కూడా తీసుకోవాలనే డెమాక్రటిక్ ధోరణితో వెళుతున్నారు.
జగన్ దీనిని అచ్చంగా పాటిస్తే గనుక… మన రాష్ట్ర రాజకీయాల్లో ఇది ప్రజాస్వామిక.. అందరి అభిప్రాయాలకు విలువ ఇచ్చే కొత్త సంప్రదాయం అవుతుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం అంటే ముఖ్యమంత్రిగా జగన్ మాత్రమే ప్రమాణం చేశారు. 8వ తేదీన మంత్రివర్గం ప్రమాణం ఉంటుందని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా 7వ తేదీన వైఎస్సార్ సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి… మంత్రులు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు పదవులకు ఎవరిని ఎంపిక చేశారో.. అందుకు గల కారణాలు ఏమిటో శాసనసభ, మండలి సభ్యులందరికీ జగన్ వివరిస్తారని సమాచారం. ఇప్పటిదాకా ఎవరూ ఇలా చేసింది లేదు. ఎంతో డెమోక్రటిక్ గా కనిపించే నాయకులు కూడా.. మంత్రివర్గం ఎంపిక గురించి సభ్యులందరికీ ముందుగా వివరించి చెప్పే ప్రయత్నం చేయలేదు. మంచి చెడుల సంగతి పక్కన పెడితే… వర్తమానంలో వ్యక్తిస్వామ్య రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు మినహాయింపు ఎంతమాత్రమూ కాదు. ఆ పార్టీకి పడిన ప్రతి ఓటూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం పడిన ఓటు మాత్రమే. అంతటి అనల్పమైన ప్రజాదరణ, పార్టీ మీద గుత్తాధిపత్యం ఒక వ్యక్తికి ఉన్నప్పుడు… సాధారణంగా వారు మరింత నియంతృత్వ పోకడలతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి కూడా మంత్రి వర్గం కూర్పు విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉండచ్చు.
కానీ… కనీసం సహచర సభ్యులందరికీ నిర్ణయం ప్రకటించే ముందుగా తెలియజేయడం మంచి పరిణామం. తాను ముఖ్యమంత్రిని గనుక… విచ్చలవిడిగా నిర్ణయాలు అందరిపై రుద్దకుండా.. ప్రజాస్వామికంగా అందరికీ తెలియజేయడమే పాలనలో శుభశ్రీకారం అనుకోవాలి.