ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళా ఎమ్మెల్యే కూటమి నేతలకు షాక్ ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడితో పాటు జనసేన నాయకులు మద్యం దుకాణాల్ని పెట్టుకోనివ్వకుండా మహిళా ఎమ్మెల్యే అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రత్యర్థులైన వైసీపీ నేతల దుకాణాల్ని అడ్డుకోడానికి అర్థం చేసుకోవచ్చు. కానీ కూటమి నేతలు లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకుని, వాటిని తెరవడానికి చేస్తున్న ప్రయత్నాల్ని సదరు మహిళా ప్రజాప్రతినిధి అడ్డుకోవడం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లినట్టు తెలిసింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివాదాలకు చిరునామాగా ఆ మహిళా ఎమ్మెల్యే పేరు వినిపిస్తుంటుంది. మూడు రోజుల క్రితం నంద్యాలలో ఒక డెయిరీ కార్యాలయానికి వెళ్లి రభస సృష్టించి, వార్తల్లో లీడర్‌గా నిలిచిన నాయకురాలెవరో అందరికీ తెలుసు. ఆ మహిళా ప్రజాప్రతినిధే తన నియోజకవర్గంలో తనకు నచ్చని కూటమి నేతల్ని కూడా మద్యం దుకాణాలు తెరవడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు.
టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డికి ఉయ్యాలవాడలో మద్యం దుకాణం దక్కింది. అలాగే జనసేన నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గీయులకు ఐదు షాపులు దక్కాయి. అయితే మూడు దుకాణాలు తెరవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సదరు మహిళా ప్రజాప్రతినిధి తెగేసి చెప్పినట్టు సమాచారం. ఏవీ సుబ్బారెడ్డి ఉయ్యాలవాడలో, అలాగే జనసేన నాయకులు దొర్నిపాడు, సిరివెళ్ల, రుద్రవరం మండలాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం వ్యాపారం చేస్తే అంగీకరించే ప్రశ్నే లేదని సదరు మహిళా నాయకురాలు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాలకు పాల్పడే కొంత మంది ఎమ్మెల్యేలపై చాలా సీరియస్ అయ్యినట్టు వారి అనుకూల పత్రికల్లో వార్తలొస్తుంటాయి. మరి కూటమి నేతల దుకాణాల్నే అడ్డుకుంటుంటే… చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు అడ్డుకునే శక్తి ఉందా? సదరు నాయకురాల్ని నిలువరించగలిగే శక్తి సామర్థ్యాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? ఎమ్మెల్యే వద్దంటే, వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వుందా? అది కూడా కూటమి నేతలకే ఇలాంటి దుర్భర స్థితి ఎదురైతే, ఇక మిగిలిన వాళ్ల సంగతేంటి? ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం ఇవ్వాలి.
vc estanu 9380537747