డుమ్మా కొడుతున్న వారి సంకేతాలు ఏమిటి?

చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం వారీ సమీక్ష సమావేశాలకు పలువురు నాయకులు హాజరుకావడం లేదు. సాధారణ నాయకులు గైర్హాజరైతే పరవాలేదు. కనీసం పార్టీ నుంచి పదవులు అందుకున్న ఎమ్మెల్సీల వంటి కీలక నాయకులు…

చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం వారీ సమీక్ష సమావేశాలకు పలువురు నాయకులు హాజరుకావడం లేదు. సాధారణ నాయకులు గైర్హాజరైతే పరవాలేదు. కనీసం పార్టీ నుంచి పదవులు అందుకున్న ఎమ్మెల్సీల వంటి కీలక నాయకులు కూడా డుమ్మాకొడుతూ ఉంటే పరిస్థితి ఏమిటి? ఇలా డుమ్మా కొడుతున్న కీలక నాయకులంతా చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసం కోల్పోయినట్లేనా అనే అభిప్రాయాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి.

తన సమీక్ష సమావేశాలకు నాయకులు డుమ్మాకొట్టడం వంటి పోకడలు చంద్రబాబునాయుడుకు విపరీతమైన విరక్తిని కలిగించినట్లున్నాయి. అందుకే మొత్తం 25 నియోజకవర్గాల సమీక్షకు ఒక డీటైల్డు షెడ్యూలు కూడా తయారుచేసి… ప్రతిరోజూ సమీక్ష పేరిట.. మనం ఓడిపోవడం లేదు… గెలుస్తున్నాం.. అని కార్యకర్తలకు చెప్పడం మాత్రమే పనిగా పెట్టుకున్న చంద్రబాబునాయుడు… బుధవారం నుంచి ఆ సమీక్షలను ఏకంగా నిలిపివేశారు. కౌంటింగ్ కు సన్నద్ధం చేసేలా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

అయితే.. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ మరోరకంగా ఉంది. 23 తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం తథ్యం అని అనుకుంటున్న తరుణంలో… చాలామంది తెలుగుదేశం నాయకులు వైకాపాకు టచ్ లో ఉంటున్నారు. ఫలితాల తర్వాత పార్టీ మారే ఉద్దేశంతోనే ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎటూ పార్టీ వీడిపోతున్నదానికి ఇప్పుడు సమీక్షల పేరిట ఈ కంచి గరుడ సేవకు హాజరుకావడం ఎందుకని.. వారు డుమ్మా కొడుతున్నట్లు సమాచారం.

చంద్రబాబు.. 2014 తర్వాత.. పెద్దసంఖ్యలో వైకాపా నాయకుల్ని తమలో కలిపేసుకున్నారు. ఇప్పుడు అందుకు ప్రతిఫలం ఉంటుందని… రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడితే గనుక… ఆయన సొంత పార్టీలోని అనేకమంది నాయకులు… నిర్మొగమాటంగా.. బైబై చెప్పేసి పార్టీ ఫిరాయించబోతున్నారని… కేవలం ప్రజాప్రతినిధులే కాకుండా.. కిందిస్థాయి పార్టీ కార్యకర్తల వరకు ఇది ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!