వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూట్ మార్చనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇకపై ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి సారించనున్నారు. అలాగే ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఒకట్రెండు రోజులు ఓపిక పడితే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనమైనా చేసుకోవచ్చు కానీ, ఏడాది అవుతున్నా తమ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అపాయింట్మెంట్ దొరకడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సన్నిహితుల వద్ద కొంత కాలంగా వాపోతున్నారు. ఇక ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టాలని జగన్ నిర్ణయించారని తెలిసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా , తమతో మాట్లాడకపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాస్తా కోపంగా ఉన్నారు. దీంతో నేరుగా సీఎంపై తమ కోపాన్ని వ్యక్తం చేసే ధైర్యం లేక, ఏదో ఒక సాకుతో అధికారులపై కొందరు ఎమ్మెల్యేలు విరుచుకుపడడం చూస్తున్నాం.
నెల్లూరు జిల్లా వెంకటగిరి సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికే పలు దఫాలు తమ జిల్లా సొంత పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు వెంకటగిరి అనేది ఈ రాష్ట్రంలో భాగం కాదా అని కూడా ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్‌రావు ఇటీవల జిల్లా మంత్రి సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమకు తెలియకుండానే అన్ని నిర్ణయాలు జరుగుతుంటే ఇక తామెందుకు ఎమ్మెల్యేలుగా ఉండడం అని ఆయన ప్రశ్నించడం సంచలనం రేకెత్తించింది.
ఇక ఇసుక అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా రేట్ల పెంపుపై గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు జిల్లా సమీక్ష సమావేశంలో నిరసన గళం వినిపించారు. ధైర్యంగా నోరు తెరిచిన వారు వేళ్ల మీద లెక్కపెట్ట గలిగే సంఖ్యలో ఉంటే, లోలోన రగిలి పోయే వాళ్ల సంఖ్య నూటికి నూరుపాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన పార్టీలో, ఏడాది పాలన కూడా పూర్తి కాకుండానే ఇలాంటి అసంతృప్తి సహజంగానే పార్టీని కలవరపెడుతోంది. బహుశా దీన్ని పసిగట్టిన సీఎం జగన్ ఇకపై పార్టీ వ్యవహారాలపై కూడా దృష్టి పెట్టేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారని సమాచారం.
ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు, అలాగే ప్రజా ప్రతినిధుల డిమాండ్లు, ఇబ్బందులు, ఇతరత్రా అంశాలపై వారి మనోభావాలు తెలుసుకునేందుకు నేరుగా చర్చించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారని తెలిసింది. గత ఏడాదిగా వైసీపీ ప్రభుత్వం ఉందే తప్ప, పార్టీ పూర్తిగా పడకేసిందని చెప్పొచ్చు. పార్టీ వ్యవహారాలను విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దోగొప్పో పర్యవేక్షిస్తున్నారు.
ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను పట్టించుకునే దిక్కే లేదు. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. ఎమ్మెల్యేల్లో కొందరికి మాత్రం ఒకటికి మించి పదవులు దక్కాయి. మిగిలిన వాళ్లకు ఏ ఒక్కటీ లేదు. ఉదాహరణకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డినే తీసుకోవచ్చు. టీటీడీలోనూ, ప్రభుత్వంలోనూ పదవులు పొందిన చెవిరెడ్డి…తుడా చైర్మన్ పదవిని కూడా దక్కించుకున్నారు.
చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం అంటే చెవిరెడ్డి…చెవిరెడ్డి అంటే ప్రభుత్వమనే భావన ఏర్పడింది. ఇక గత కొన్నేళ్లుగా పార్టీకి పనిచేసిన నాయకుల పరిస్థితి త్రిశంకు స్వర్గమే. సహజంగానే అలాంటి ప్రజాప్రతినిధులు, నాయకులు అసంతృప్తితో ఉంటున్నారు. పార్టీకి నష్టం కలిగించొద్దనే ఉద్దేశంతో మౌనం పాటిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధోరణులు ఒక్క చిత్తూరు జిల్లాకే పరిమితం కాలేదు. అన్ని జిల్లాల్లోనూ ఎక్కువ తక్కువల్లో తేడా ఉండొచ్చేమో కానీ…అసంతృప్తి మాత్రం పక్కా.
ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ వైసీపీ బలోపేతంపై దృష్టి సారించాలని నిర్ణయించుకోవడం శుభపరిణామమే. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజూ పది మంది ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయ్యేందుకు నిర్ణయించారని సమాచారం. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్టు తెలుస్తోంది. తన పార్టీ ప్రజాప్రతినిధులతో మాట్లాడితే చాలా సమస్యలకు జగన్ పరిష్కారం ఇచ్చే అవకాశాలున్నాయి.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తూ, పార్టీని పూర్తి స్థాయిలో గాలికి వదిలేశారు. దీంతో ఆయన ఎంత మూల్యం చెల్లించుకున్నారో కళ్లెదుటే కనిపిస్తోంది. ఇప్పుడు అదే తప్పు జగన్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే తాను ఒన్ టైమ్ సీఎం అనిపించుకోడానికి సిద్ధంగా లేరు.