దొరికిపోయిన దొంగను చూస్తే ప్రతివోడూ ఓ దెబ్బవేసేవాడే అని వెనకటికి ఓ మాట. ఆర్ఆర్ఆర్ పరిస్థితి అలాగే వుంది పాపం. ఆర్ఆర్ఆర్ దొంగ కాదు. టాలీవుడ్ లో తయారవుతున్న భారీ సినిమా. కానీ పాపం, కరోనా బారినపడింది. దాంతో అసలు ఎప్పుడు మొదలవుతుందో? ఎప్పుడు పూర్తవుతుందో? ఎప్పుడు విడుదలవుతుందో? అస్సలు తెలియని పరిస్థితి అయిపోయింది.
దాంతో అసలే కరోనా టైమ్ లో వార్తలు లేక అల్లాడుతున్న జనాలకు ఆర్ఆర్ఆర్ మాంచి ఆటవస్తువులా దొరికింది. ఆడేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న రెండు వార్తలు ఆర్ఆర్ఆర్ కు సంబంధించి బయటకు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి టెస్ట్ షూట్ ప్రయత్నం అని, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాల్గొంటున్నారని. కానీ యూనిట్ సన్నిహిత వర్గాలు, అబ్బే..అలాంటిదేం లేదు అని పెదవి విరుస్తున్నాయి.
సిటీ పరిథిలో వందలాది కేసులు వస్తుంటే, టెస్ట్ షూట్ అయినా సరే, హీరోలను సెట్ కు రప్పించడం అవసరమా? అసలు టెస్ట్ షూట్ అన్నపుడు హీరోలు ఎందుకు వస్తారు? అని క్వశ్చన్ వేస్తున్నారు. ఇది కూడా పాయింట్ నే కదా?
ఇదిలా వుంటే హీరోయిన్ ఆలియా భట్ ముంబాయిలో చిక్కుకుపోయింది. ఆమె ఇఫ్పట్లో రావడం కష్టం. అందుకు ఆల్టర్ నేటివ్ చూస్తున్నారు అంటూ మరో వార్త. మరి ఇంతకీ అదే ముంబాయిలో చిక్కకున్న అజయ్ దేవగన్ సంగతేమిటి? ఆయననూ మార్చేస్తారా? మరి ముంబయి సంగతే అలా వుంటే విదేశాల నుంచి రావాల్సిన హీరోయిన్, కొందరు నటుల సంగతేమిటి? వాళ్లనూ మార్చేస్తారా?
ఇలాంటి ప్రశ్నలు యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సినిమాను బాలీవుడ్ లో మాంచి రేటుకు అమ్మాలి, అక్కడ బజ్ రావాలి అంటే ఎన్టీఆర్-రామ్ చరణ్ సరిపోరు. ఆలియాభట్ లాంటి క్రేజీ హీరోయిన్ వుండాలి. రాజమౌళి తెలివి తక్కువై ఆలియాభట్ కు మూడు నాలుగు కోట్లు ఇచ్చి తీసుకోలేదు. బాలీవుడ్ లో సినిమాలో ఎవరు అంటే ఆలియాభట్, అజయ్ దేవగన్ పేరు వాడాలి తప్పదు. మనకు ఎన్టీఆర్, రామ్ చరణ్ గొప్ప కానీ, బాలీవుడ్ కు కాదు. ఈ సినిమా తరువాత సంగతి వేరు. సినిమా ముందు సంగతి వేరు.
మొత్తానికి ఈ గ్యాసిప్ ల వల్ల ఓ మంచి కూడా జరుగుతోంది. ఎప్పుడో ఏడాది తరువాత వచ్చే ఆర్ఆర్ఆర్ ను వార్తల్లో సజీవంగా వుంచుతోంది. అవును ఇంతకీ ఆలియాభట్ కు అల్టర్ నేటివ్ చూసుకుంటే ఇచ్చిన అడ్వాన్స్ సంగతేమిటో? అది కూడా చెపితేబాగుండేదేమో?