మాస్క్ లేకుండా బైటకొస్తే వెయ్యి రూపాయల జరిమానా, ఇల్లు దాటి బయటకొస్తే మాస్క్ ధరించడం తప్పనిసరి.. అంటూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హుకుం జారీ చేశాయి. బీజేపీ రూలింగ్ లో గుజరాత్ లోనైతే.. మాస్క్ లేకపోతే ఏకంగా 5వేలు జరిమానా లేదంటే మూడేళ్లు జైలు శిక్ష. అహ్మదాబాద్ కమిషనర్ ఆల్రెడీ మార్నింగ్ వాక్ కోసం వచ్చిన కొంతమంది వద్ద జరిమానా వసూలు చేసి రికార్డు సృష్టించారు కూడా.
మార్నింగ్ వాక్ కి వచ్చే ధనిక వర్గం సంగతి సరే.. మరి పేదల సంగతేంటి. మాస్క్ కొనుక్కోడానికి కూడా డబ్బులు లేని పేదోళ్లు 5వేలు ఫైన్ కడతారా, లేక ఈ దేశంలో పుట్టిన పాపానికి మూడేళ్లు జైలుకెళ్తారా? దేశవ్యాప్తంగా ఇలాంటి తలతిక్క నిర్ణయాల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో మాస్క్ లు లేకుండా బైటకొస్తున్న వారిని పోలీసులు ప్రశ్నిస్తుంటే.. విచిత్రమైన సమాధానాలు ఎదురవుతున్నాయి. మాస్క్ లు కొనే డబ్బులు మా వద్దలేవు, గవర్నమెంట్ మాకేమైనా మాస్క్ లిచ్చిందా అంటూ పోలీసుల్ని నిలదీస్తున్నారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున ఉచితంగా మాస్క్ లు ఇచ్చే ప్రణాళిక సిద్ధం చేశారు ముఖ్యమంత్రి. 5 కోట్ల 30లక్షల జనాభాకు.. ఒక్కొక్కరికి 3 మాస్క్ ల చొప్పున 16కోట్ల మాస్క్ లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి మాస్క్ ల సేకరణ, తయారీపై దృష్టిపెట్టాలని సూచించారు.
రేపోమాపో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత మాస్క్ ల పంపిణీ మొదలు కాబోతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు ఈ పని మొదలు పెట్టాయి. అయితే ఇవి అందరికీ అందాయా అంటే అనుమానమే. ఇప్పుడు ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా మాస్క్ ల పంపిణీ చేపడుతోంది కాబట్టి, ఎవరూ మాకు మాస్క్ లు లేవు, మేం కొనుక్కోలేకపోయాం అని అనలేరు.
అంటే ఏపీలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి బైటకి రావాలన్నమాట. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ పూర్తయితే.. నిర్బంధ మాస్క్ ధారణ అమలులోకి వచ్చినట్టే. ఈ విషయంలో జగన్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. జగన్ నిర్ణయంతో ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా ప్రజలకు ఉచితంగా మాస్క్ అందించే ఆలోచన చేస్తున్నాయి. పొరుగునే ఉన్న తెలంగాణలో మాస్క్ మస్ట్ అంటూ హుకుం జారీచేసిన సీఎం కేసీఆర్ కూడా ఈ దిశగా ఆలోచిస్తే బెటరేమో. అసలే హైదరాబాద్ లో సామాన్యులకు మాస్కులు దొరకడం లేదు.