సీమ‌కు జ‌గ‌న్ మరో వ‌రం.. ఈ ప‌నులు పూర్త‌యితే!

రాయ‌ల‌సీమ‌కు హంద్రీనీవా ప‌థ‌కం వ‌ర‌ప్ర‌దం. ఎన్టీఆర్ హ‌యాంలో ఈ ప‌థ‌కానికి శంకుస్థాప‌న‌లు జ‌రిగాయి. అయితే ఆ త‌ర్వాత ద‌శాబ్దాల పాటు కేవ‌లం శంకుస్థాప‌న రాళ్లు మాత్ర‌మే మిగిలాయి. తొమ్మిదేళ్ల చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో హంద్రీనావాకు…

రాయ‌ల‌సీమ‌కు హంద్రీనీవా ప‌థ‌కం వ‌ర‌ప్ర‌దం. ఎన్టీఆర్ హ‌యాంలో ఈ ప‌థ‌కానికి శంకుస్థాప‌న‌లు జ‌రిగాయి. అయితే ఆ త‌ర్వాత ద‌శాబ్దాల పాటు కేవ‌లం శంకుస్థాప‌న రాళ్లు మాత్ర‌మే మిగిలాయి. తొమ్మిదేళ్ల చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో హంద్రీనావాకు సంబంధించి ఇంచు ప‌ని కూడా జ‌ర‌గ‌లేదు. 

అస‌లు అలాంటి ప్ర‌తిపాద‌న‌ ఒక‌టి ఉంద‌ని కూడా ప్ర‌జ‌లు కూడా మ‌రిచిపోయిన ప‌రిస్థితి. వైఎస్ రాజశేఖ‌ర రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాకా మ‌ళ్లీ హంద్రీనీవా ప్ర‌తిపాద‌న తెర‌పైకి వ‌చ్చింది. ఎన్టీఆర్ హ‌యాం నాడు రూపొందించిన మ్యాపుల‌కు కాస్త మార్పు చేర్పులు జ‌రిగాయి. బృహత్త‌ర స్థాయిలో హంద్రీనీవా ప్రాజెక్టు ప‌నులు జ‌రిగాయి. క‌రువు సీమ క‌నివినీ ఎర‌గ‌ని రీతిలో సాగు, తాగు నీరు అందుబాటులోకి వ‌చ్చింది, వ‌స్తోంది.

ప్ర‌స్తుతం హంద్రీనీవా కాలువలు అనంత‌పురం జిల్లా చివ‌రాఖ‌రు వ‌ర‌కూ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా చాలా వ‌ర‌కూ ప‌నులు పూర్త‌య్యాయి. కొంత మేర నీరు అందుతూ ఉంది. అయితే.. ఈ కాలువులు సాగే ప్రాంతం మాత్ర‌మే ప్ర‌స్తుతం ఎక్కువ ల‌బ్ధి పొందుతూ ఉంది. ప‌లు చెరువుల‌కు ఈ కాలువ‌ల నుంచి క‌నెక్టివిటీ ఏర్పాటు చేశారు. 

రాప్తాడు, ధ‌ర్మ‌వ‌రం, పుట్ట‌ప‌ర్తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని పెద్ద పెద్ద చెరువుల‌కు ప్ర‌స్తుతం హంద్రీనీవా కాలువ‌తో క‌నెక్టివిటీ ఉంది. వీటిల్లో బుక్క‌ప‌ట్నం చెరువు అతి పెద్ద‌ది. ఉమ్మ‌డి ఏపీలోనే అతి పెద్ద చెరువు బుక్క‌ప‌ట్నం చెరువు. 

విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్య‌పు రాజుల్లో ఒక‌రైన‌ బుక్క‌రాయులు ఈ చెరువును త‌వ్వించాడు. చాలా యేళ్లుగా స‌హ‌జంగానే నిండిన ఈ చెరువు మ‌ధ్య‌లో కొన్నేళ్లు ఎండుపోయింది. హంద్రీనావాతో దీనికి మ‌ళ్లీ క‌ల‌వ చ్చింది. గ‌త రెండు మూడేళ్లుగా ఈ చెరువు ఫుల్ గా ఉంది.

అలాగే ధ‌ర్మ‌వ‌రం చెరువు కూడా మ‌రో పెద్ద నిర్మాణం. ఈ చెరువు కూడా గ‌త ఏడాది నిండింది. మ‌ర‌వ పోయింది. ఇవి గాక‌.. ఈ ప్రాంతంలో అనేక ప‌ల్లెల‌కు ఆనుకుని ఉన్న ప‌లు చెరువులు కూడా హంద్రీనీవా నీటితో కృష్ణ‌మ్మ జ‌లాల‌ను పొందుతున్నాయి. కానీ.. ఇంకా ఈ వ‌న‌రు ఏర్ప‌డ‌ని చెరువుల సంఖ్య వంద‌ల్లో ఉంది!

ఎంత‌లా అంటే.. ఒక్క పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే ఏకంగా 190కి పైగా చెరువులున్నాయి. ఇవ‌న్నీ హంద్రీనీవా కాలువ‌కు అటూ ఇటూ ఉన్న‌వే. గ‌రిష్టంగా ఇర‌వై ముప్పై కిలో మీట‌ర్లు, క‌నిష్టంగా రెండు మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఈ చెరువులున్నాయి. వీటిల్లో చాలా వాటికి గ్రావిటీ ద్వారానే నీళ్లు అందించే అవ‌కాశం ఉంది! ఆ ప‌నిని స్థానికులు ఎప్పుడో గుర్తించారు. 

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో పుట్ట‌ప‌ర్తి అభ్య‌ర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన దుద్దుకుంటు శ్రీధ‌ర్ రెడ్డి ప్ర‌చారంలో ఈ అంశాన్నే హైలెట్ చేసుకున్నాడు. త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే.. నియోజ‌క‌వ‌ర్గంలోని చెరువుల‌కు నీళ్లు అందించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించుకున్నాడు.  

ఇప్పుడు విశేషం ఏమిటంటే.. అందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇటీవ‌లే కేబినెట్ భేటీలో పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని చెరువుల‌ను హంద్రీనీవా కాలువ‌ల‌కు అనుసంధానించ‌డం గురించి ఆమోద‌ముద్ర వేశారు. ఈ ప్రాజెక్టు విలువ 854 కోట్ల రూపాయ‌లు. 

హంద్రీనీవా కాలువ‌ల‌కు ఉప‌కాలువ‌ల‌ను తవ్వ‌డం ద్వారా 193 చెరువుల‌ను నింపే అవ‌కాశం ఉంది. దీని ద్వారా పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం అంతా స‌స్య‌శ్యామ‌లం అవుతుంది. క‌రువు సీమ‌కు అంత క‌న్నా కావాల్సిన‌ది మ‌రే ఉండ‌దు. బెంగ‌ళూరుకు స‌మీప‌మైన ప్రాంతం కావ‌డంతో, అక్క‌డ నీటి వ‌న‌రులు మెరుగైతే వేరే ర‌క‌మైన ప్రాజెక్టులు వ‌చ్చే అవ‌కాశాలు మెరుగ‌వ్వ‌డం ఖాయం. 

ఇచ్చిన‌మాట మేరకు, ఎన్నిక‌ల ముందు చెప్పిన ప్ర‌ణాళిక మేర‌కు ఒక గొప్ప కార్యానికే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ ప‌నిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్రభుత్వం త‌న ద‌క్ష‌త‌ను చాటుకోవాలి.